Friday, April 26, 2024

ఒమిక్రాన్ దడ

- Advertisement -
- Advertisement -

 

World is once again trembling with fear of Covid 19 new variant Omikron

వేగంగా వ్యాపించే లక్షణాలున్న కొత్త కొవిడ్ వేరియెంట్‌పై ప్రపంచమంతటా అప్రమత్తత

ఆందోళనకర వేరియెంట్‌గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్‌వానా, ఇజ్రాయెల్, బెల్జియంలలో వెలుగుచూసిన కేసులు డెల్టా కంటే ప్రమాదకరమని అంచనా నిపుణులతో చర్చిస్తున్న డబ్లూహెచ్‌ఒ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం తీసుకోవాల్సిన చర్యలపై శనివారం నాడు అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష, ఆదివారం మరోసారి సమావేశం పరిశీలనలో విమాన ప్రయాణికులపై ఆంక్షలు విధించే అంశం

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కేసులు తగ్గినప్పటికీ.. కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో.. ఇది మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన ’బి.1.1.529’ వేరియంట్ కేసులు ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్‌వానా, ఇజ్రాయెల్, బెల్జియంలోనూ వెలుగు చూశాయి. తాజాగా జర్మనీ, చెక్‌రిపబ్లిక్ దేశాలకూ వ్యాపించింది. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అధిక మ్యూటేషన్ల వల్ల డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చగా, వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏంటీ కొత్త వేరియంట్..?

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కరోనా వేరియంట్‌ను ’బి.1.1.529’గా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్త వేరియంట్‌కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని ‘ఆందోళనకర వేరియంట్ (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)’గా వర్గీకరించి, ’ఒమిక్రాన్’ అని నామకరణం చేసింది. కొద్దిరోజుల కిందటే ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’గా గుర్తించిన బి.1.1.529పై చర్చించేందుకు ఉన్నతాధికారులు, నిపుణులతో డబ్ల్యూహెచ్‌ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించింది. కొత్త వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని ఇండియన్ సార్స్-కొవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. కొత్త వేరియంట్‌ను పర్యవేక్షిస్తున్నామని, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

వ్యాక్సిన్లు పనిచేస్తాయా..?

కొత్త వేరియంట్‌కు ప్రస్తుత వ్యాక్సిన్లు ఎంత మేరకు సమర్థవంతంగా పనిచేస్తాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని ఇప్పటివరకు నిర్థారణ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా కొత్త వేరియంట్‌కు ప్రస్తుత వ్యాక్సిన్లు కొంత మేరకు పనిచేయవచ్చు…లేదా పూర్తిగా పనిచేయకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు కొత్త వేరియంట్లపై అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా వ్యాక్సిన్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ ఎలా వ్యాపిస్తుందనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే కొత్త వేరియంట్ గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ గాలి ద్వారా వ్యాపిస్తే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాలలో ప్రజలు గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు తీసువాలని చెబుతున్నారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, సినిమా హాళ్లతో పాటు ఇతర రద్దీ ప్రాంతాలలో తప్పనిసరిగా భౌతికదూరం పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

కొవిడ్ కొత్త వేరియంట్లు, మూడో దశ వస్తే చేయాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ప్రజారోగ్య బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో శనివారం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఆదివారం మరోసారి సమావేశం కానున్నారు. కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కొత్త వేరియంట్ విజృంభణపై కేంద్రం రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. దక్షిణాఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబయ్, దిల్లీలో దిగి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల గుర్తించడం, వారికి పరీక్షలకు సంబంధించిన అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు.

మాస్క్‌లు ధరించి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి : డాక్టర్ రంగారెడ్డి బుర్రి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ రంగారెడ్డి బుర్రి తెలిపారు. తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ప్రధానంగా రద్దీ ప్రదేశాలలో ప్రజలు గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కచ్చితంగా భౌతికదూరం పాటించాలని అన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంత మేరకు ప్రమాదకరం అనే విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు. ఇప్పటికే వివిధ దేశాలలో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News