Home ఎడిటోరియల్ తల్లి పాల బ్యాంకులు తెరవాలి!

తల్లి పాల బ్యాంకులు తెరవాలి!

World Mother milk weekly was announced from August 1to7

ఆగష్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రకటించారు. ఈ సందర్భంగా “తల్లిపాలు: జీవితానికి పునాదులు” అనే నినాదం కూడా ఇచ్చారు. చాలా సరళంగా, చాలా సూటిగా ఉన్న నినాదమిది. బిడ్డకు తల్లిపాలే పట్టాలన్న వాదనకు బలమిచ్చే నినాదం. నిజానికి ఈ నినాదంలో కాని, ఈ ఉద్యమంలో కాని ఎలాంటి వివాదమూ లేదు. అసలు తల్లిపాలను ప్రోత్సహించడానికి ఉద్యమమూ, నినాదాలు కూడా అవసరం లేదు. అతి సహజంగా జరగవలసిన ప్రక్రియ.
అయితే ఇందులో కూడా వివాదాలున్నాయి. వివాదాల కన్నా ముందు కొన్ని వాస్తవాలను చూద్దాం. పసిపిల్లల మరణాల్లో 45 శాతం మరణాలు కేవలం పోషకాహారలోపం కారణంగా జరుగుతున్నాయి. పసిపిల్లల మరణాలను నిరోధించడానికి తల్లిపాల కన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. పసితనంలో వచ్చే అనేక వ్యాధులను నివారించడానికి తల్లిపాలు ఉపయోగపడతాయి. పసిపిల్లల మరణాలకు డయేరియా, న్యూమోనియా వంటి వ్యాధులు ప్రధాన కారణాలు. ప్రపంచవ్యాప్తంగా శిశుమరణాలకు ముఖ్యమైన కారణాలివి. ఈ రెండింటిని తల్లిపాలతో నిరోధించవచ్చు. దీర్ఘకాలం వరకు తల్లిపాలు పట్టడం వల్ల తల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనివల్ల రొమ్ము క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ల ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. టైప్ 2 డయాబెటిస్, ప్రసూతి తర్వాతి డిప్రషన్ వంటివి కూడా ఉండవు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం శిశువు పుట్టిన తర్వాత మొదటి ఆరునెలల కాలం తల్లిపాలను తాగితే వారి పెరుగుదల చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యపరమైన ఈ ప్రయోజనాలే కాదు కుటుంబానికి ఆర్ధికపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. తల్లిపాలకు బదులు డబ్బాపాలను కొనే ఖర్చు తగ్గిపోతుంది. జాతీయ స్థాయిలో ఆరోగ్యపరిరక్షణకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ ప్రయోజనాలున్నప్పటికీ తల్లిపాలను పట్టే సంస్కృతి తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే, పనులు చేసే మహిళల్లో తల్లిపాలు పట్టడం తక్కవవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఆరునెలల లోపు శిశువుల్లో కేవలం 36 శాతం శిశువులు మాత్రమే తల్లిపాలు తాగారని 2007 నుంచి 2014 మధ్యకాలంలో సర్వే తెలుపుతుంది. భారతదేశంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ కేర్ సర్వే 4 (2015-16) ప్రకారం మూడు సంవత్సరాల లోపు పిల్లల్లో కేవలం 41.6 శాతం శిశువులు మాత్రమే పుట్టిన గంటలోపు తల్లిపాలను పొందారు. కేవలం 54.9 శాతం శిశువులు మాత్రమే ఆరునెలల లోపు వయసులో తల్లిపాలను పొందగలిగారు. ప్రపంచ గణాంకాలతో పోల్చితే భారతదేశంలో పరిస్థితి కాస్త మెరుగు. అయినా సగం మంది శిశువులు తల్లిపాలకు దూరంగా ఉన్నారన్నది వాస్తవం.

మద్రాసు హైకోర్టు జస్టిస్ కిరుబకరన్ 2017లో ఈ విషయమై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అధికరణ 21 ప్రకారం తల్లిపాలు శిశువు ప్రాథమిక హక్కుగా ఎందుకు ప్రకటించలేదని అడిగారు. తల్లిపాలను పట్టడం అన్నది సహజమైన విషయమే అయినా ఇందులో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. కుటుంబం, సమాజం, ప్రభుత్వం అందరి ప్రమేయం ఇందులో ఉంది. అందరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అయితే తల్లి ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంటుంది. తన బిడ్డ ఆరోగ్యం, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మొదటి వ్యక్తి తల్లి మాత్రమే. మిగిలిన వారంతా కేవలం తల్లికి బిడ్డకు అవసరమైన మద్దతు ఇచ్చేవారు మాత్రమే. అయితే ఈ మద్దతు విషయంలోనే లోపాలు కనబడుతున్నాయి. శిశువులకు పాలకు బదులు ప్రత్యామ్నయాలు ఇవ్వడానికి సంబంధించి చట్టం చేసిన కొన్ని దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఇన్‌ఫాంట్ మిల్క్ సబ్ స్టిట్యూట్స్ ఫీడింగ్ బాటిల్ అండ్ ఇన్ ఫాంట్ ఫుడ్స్ రెగ్యులేషన్ ఆఫ్ ప్రొడక్షన్ సప్లయ్ అండ్ డిస్ట్రీబ్యూషన్ చట్టం 1992 దేశంలో ఉన్నప్పటికీ తల్లిపాల ప్రత్యామ్నయాలు ఉత్పత్తి చేసే పరిశ్రమలు డాక్టర్ల ద్వారా, నర్సుల ద్వారా ఇతర వైద్య సిబ్బంది ద్వారా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

అనేకమంది తల్లులు ఇలాంటి ఆహారం శిశువులకు ఇచ్చేలా ప్రోత్సహిస్తున్న ఉదంతాలున్నాయి. పోషకాహారం పేరుతో, పెరుగుదల బాగుంటుందన్న పేరుతో, తల్లిపాలు పట్టే స్థితిలో ఉందా లేదా అన్న ప్రశ్నలతో ఈ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు. తల్లిపాలకు ఏ విధమైన ఆహారం కూడా ప్రత్యామ్నయం కాదన్నది నిర్ధారణ అయిన సత్యం. తల్లిపాలు సరిపోవన్నది కేవలం భ్రమ, కట్టుకథ మాత్రమే. కాని ఈ ప్రచారాన్ని చాలా మంది తల్లులు నమ్మే పరిస్థితి ఉంది.
తల్లిపాలకు బదులు ఇతర ఆహారాన్ని ఇవ్వడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం భారత మార్కెట్టులో ఉన్న అనేక ఫార్ములా ఆహారపదార్థాల్లో జన్యుపరంగా మార్పులకు గురిచేసిన పదార్థాలు కలిపినట్లు తెలుస్తోంది. ఇది అనైతికం. ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యపరమైన, పర్యావారణ పరమైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల కేవలం ఇలాంటి ఆహారపదార్థాల ప్రకటనలపై ఆంక్షలు పెట్టినంత మాత్రాన సరిపోదు. మహిళలు, కుటుంబాల్లో అవగాహన పెంచడానికి, ఇలాంటి ఆహారం వల్ల వాటిల్లే నష్టాలను తెలియజేయడానికి ఉద్యమం నడపవలసి ఉంది.

కొన్ని సందర్భాల్లో తల్లి పాలు పట్టలేని పరిస్థితిలో ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డకు అవసరమైన పాల సరఫరా కోసం పాల బ్యాంకులు దేశంలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. భారతదేశంలో 2017లో మానవపాల బ్యాంకు ఒకటి ఏర్పడింది. ఈ విషయంలో బ్రెజిల్ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. అక్కడ శిశుమరణాల రేటును అద్భుతంగా నిరోధించారు. దేశంలో 200 మానవపాల బ్యాంకులు ఏర్పాటు చేసి శిశువులకు పాలసరఫరాలో అడ్డంకి లేకుండా చూసుకున్నారు. అయితే ఈ విషయంలో అవకతవకలు, అక్రమాలు, కాలుష్యాలు లేకుండా గట్టి చర్యలతో ఈ బ్యాంకులు ప్రారంభం కావాలి.

ఉద్యోగాలు చేసే మహిళలకు చాలా సమస్యలున్నాయి. అయితే దేశంలో ఉద్యోగాలు, పనుల్లో కేవలం 27 శాతం మాత్రమే మహిళలున్నారు. ఇందులో 96 శాతం అసంఘటిత రంగాల్లో ఉన్నారు. పని చేస్తూ శిశువుకు పాలుపట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఉంటారు. విధానపరమైన నిర్ణయాలతో ఇలాంటి తల్లులకు అవసరమైన మద్దతు ఇవ్వాలి. మెటర్నిటి బెనిఫిట్స్ చట్టం 2017 కేవలం సంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. వారికి 26 వారాలు జీతంతో ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇంకా అనేక సదుపాయాలు లభిస్తున్నాయి. కాని ఈ చట్టం వల్ల ప్రయోజనాలు ఎన్ని వచ్చాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. దీని వల్ల మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలిచ్చిన వారే ఈ ఖర్చులన్నీ భరించవలసి వస్తుంది కాబట్టి మహిళలకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. మెటర్నిటి ప్రయోజనాల విషయంలో ఉద్యోగాలిచ్చే వారి పైనే ఖర్చుల భారం మోపడం మంచిది కాదని అంతర్జాతీయ కార్మికసంస్థ నివేదిక కూడా పేర్కొంది.