Home అంతర్జాతీయ వార్తలు రష్యా వ్యాక్సిన్‌ సేఫేనా?

రష్యా వ్యాక్సిన్‌ సేఫేనా?

 మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌పై అనుమానాలు

 సమర్థవంతమైన సాక్షాధారాలపై పరిశోధన ప్రపంచం సందేహాలు

 అత్యంత వేగంగా జరిగే పరిశోధనలతో దుష్ప్రభావాలు
 టీకా సమర్థత, భద్రతా ప్రమాణాలపై అనుమానాలు

 రష్యా ప్రజలను పుతిన్ రిస్క్‌లో పెడుతున్నారని హెచ్చరిక

 తొలి టీకాపై ఆదిలోనే నీలినీడలు

world scientists have Doubts on Russia vaccine

న్యూఢిల్లీ: కరోనా నివారణకు సమర్థమైన వ్యాక్సిన్‌ను తామే ముందుగా తయారు చేయగలిగామని రష్యా ప్రకటించినప్పటికీ నిర్ణీత సమయంలో దాని పరీక్షలు సరిగ్గా జరగలేదని, అలాగే దాని సమర్థతను నిరూపించే సరైన సాక్షం లేదని భారత్‌తోసహా ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు తమ సందేహాలను వెలిబుచ్చుతున్నారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ స్పూత్నిక్ వి వ్యాక్సిన్ సమర్థత, భద్రత గురించి ప్రకటన చేస్తూ తన కుమార్తెకు ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టు వెల్లడించడం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశం అయింది. ఈ ప్రకటన చిటికెడు ఉప్పుగా తీసుకోవాలని భారత ఇమ్యునాలజిస్టు వినీతా బాల్ వ్యాఖ్యానించారు. కొంత డేటా అయిన ప్రజల ముందుకు రాకుంటే, 2020 జూన్ నుంచి ఆగస్టు వరకు విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించామని చెప్పినా ఈ వ్యాక్సిన్ సమర్థతను విశ్వసించడం కష్టమని పేర్కొన్నారు. బాల్ పునెకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చి లో ఇమ్యునాలజిస్టుగా పని చేస్తున్నారు. మానవ సమాజానికి సవాలుగా మారిన ఈ అధ్యయనం గురించి వారు మాట్లాడుతారా? అలా అయితే ఆ సాక్షం కూడా రక్షణ సామర్ధాన్ని పరిశీలించడానికి ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. అమెరికా కేంద్రమైన మౌంట్ సినాయి ఇకహన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఫ్లోరియన్ క్రమ్మెర్ వ్యాక్సిన్ భద్రతను ప్రశ్నించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో పరీక్షలు లేనందున తాను దీన్ని అంగీకరించలేనని వ్యాఖ్యానించారు. ఇది భద్రతని, పనిచేస్తుందని ఎవరికి తెలుసు? అని ఆయన ప్రశ్నించారు. రష్యావారు ఆరోగ్య కార్యకర్తలను, ప్రజలను రిస్కులో ఉంచారని వ్యాఖ్యానించారు. క్రమ్మెర్ అభిప్రాయానికి భారత ఇమ్యునాలజిస్టు సత్యజిత్ రథ్ మద్దతు పలికారు.

వ్యాక్సిన్ పనిచేస్తుందని నిర్ణయించడానికి రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తటస్థ యాంటీబాడీల ఉత్పతిపై రష్యావారు ఆధా రపడినట్టు కనిపిస్తోందని, తటస్థీకరణ అయిన యాంటీబాడీ కణాన్ని రక్షించడం అన్నది జీవశాస్త్ర పరంగా జరుగుతుంటుం దని అన్నారు. ఇది ప్రజలకు అందుబాటులో రాకపోయినప్పటికీ ఇది ఉపయోగకరమైన ప్రాథమిక సమాచారమేనని, అయితే ఇది వ్యాక్సిన్ రక్షణ సామర్ధానికి తగిన సాక్ష్యం కాదని ఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీకి చెందిన ఇమ్యునాలజిస్టు వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారీ దారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలు సూచించింది. రెండో దశ ట్రయల్స్‌లో సమర్థత పరీక్ష కొద్దిమందికే పరిమితమౌతుంది. మూడో దశ ట్రయల్స్‌లో భారీ ఎత్తున జనసమూహంపై భద్రత, సమర్థత అన్నీ పరీక్షించడమౌతుంది. అందువల్ల రెండో దశ ట్రయల్స్ పూర్తి చేయడం సాధ్యమే కానీ మూడో దశ ట్రయల్స్ మాత్రం అలా వీలుకాదని కోల్‌కతా సిఎస్‌ఐఆర్ ఐఐసిబి వైరాలజిస్టు ఉపాసనరే పేర్కొన్నారు.

తిరువనంతపురం రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇ.శ్రీకుమార్ తన అభిప్రాయం చెబుతూ వ్యాక్సిన్ రెడీ అయినా అనేక సవాళ్లు ఎదురౌతాయని ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సమర్థత ఇస్తుందో, అలాగే కరోనా వైరస్ జాతులు అనేకం ఉన్నందున వాటన్నిటినీ ఇది నివారిసుందో లేదో, కూడా పరిశీలించాల్సి ఉందని అన్నారు. కరోనా కాలానుగుణంగా మార్పులు చెందుతున్నందున ఆ మార్పులను కూడా ఈ వ్యాక్సిన్ నిరోధించ గలుగుతుందా అన్న ది ప్రశ్నార్థకమని విశ్లేషించారు. చాలా వ్యాక్సిన్లు ప్రోత్సాహకరంగా కనిపించినా మూడోదశ ట్రయల్స్‌లో మాత్రం తొట్రుపాటు పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ జామా ఇంటర్నల్ మెడిసిన్‌లో 2016 అధ్యయనంలో అమెరికాలో మూడోదశ ఔషధ ట్రయల్స్ నిర్వహించిన 640 ఔషధాలకు సంబంధించిన విశ్లేషణలో దాదాపు 344ఔషధాలు అంటే 50 శాతం ఔషధాలు వైఫల్యం చెందాయని వెలువడింది. రష్యా అధికార వర్గాలు ఒకటి, రెండు దశల ట్రయల్స్ నిర్వహించి ఉండవచ్చు, కానీ మూడోదశ ట్రయల్స్ వేగంగా పూర్తి చేశారనడం డేటా బయటపడితే కానీ నమ్మశక్యం కాదని ఉపాసన రే చెప్పారు. రష్యావారు జూన్‌లో ట్రయల్స్ ప్రారంభించారు. ఆగస్టు సగం కూడా ఇంకా పూర్తి కాలేదు. అలాంటప్పుడు మూడోదశ ట్రయల్స్ ఎలా పూర్తి చేయగలుగుతారు? అని ప్రశ్నించారు. బహుశా వ్యాక్సిన్ విడుదలతోపాటు మూడో దశ ట్రయల్స్ వారు ప్రారంభిస్తారేమో అని సందేహం వెలిబుచ్చారు.

ఇది నిజంగా భయం.. రిస్కు: జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ వ్యాఖ్య
ఈ వ్యాక్సిన్ విడుదల అవుతున్నదంటే నిజంగా భయం కలుగుతోంది. అలాగే ఇది రిస్కు కూడా అని జాన్స్‌హాప్‌కిన్స్ యూనివర్శిటీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ వ్యాక్సిన్ సేఫ్టీ డైరెక్టర్ డేనియల్ సాల్మన్ వ్యాఖ్యానించారు. సాల్మన్, మరికొందరు నిపుణులు రష్యా వ్యాక్సిన్ గురించి తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. మూడో దశ ట్రయల్స్ నిర్వహించకుండా రష్యా ప్రమాదకరమైన అడుగు వేస్తోందని వ్యాఖ్యానించారు. రోగులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి భిన్నంగా ఆరోగ్యవంతులైన జనసమూహానికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఉన్నత స్థాయిలో భద్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కొన్ని లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే వారిలో కొన్ని వేల మందికి అరుదైన రుగ్మతలు ఎదురౌతుంటాయని పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ దాని సమర్థత, భద్రతకు సంబంధించిన డేటా లోపించినప్పుడు అది ఎంతవరకు పనిచేస్తుందో నమ్మలేం. అది ఇంకా మూడో దశ ట్రయల్స్‌లోనే ఉంది. దీన్నిబట్టి అది ఇంకా పూర్తికాలేదు. పరిమిత సంఖ్యలో కాకుండా భారీ సంఖ్యలో ప్రజలపై ప్రయోగించి ఫలితాల కోసం రెండు నెలల వరకు నిరీక్షించాకే ఆ వ్యాక్సిన్ సమర్థత బయటపడుతుంది. రష్యాలో అలా చేసినట్టు కనిపించడం లేదు. –సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా

world scientists have Doubts on Russia vaccine