Wednesday, April 24, 2024

ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం బెంగాల్‌లో…

- Advertisement -
- Advertisement -

Worlds-largest-temple

కోల్‌కతా: ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌లో ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న వేదిక్ ప్లానిటేరియం ఆలయాన్ని ఇస్కాన్ నదియా జిల్లాలోని మాయాపూర్‌లో నిర్మిస్తోంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణా కాన్షియస్‌నెస్(ఇస్కాన్) ప్రధాన కార్యాలయం మాయాపూర్‌లోనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ప్రాంగణంలో రూపుదిద్దుకుంటున్న ఈ కృష్ణాలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. పురాతన సంస్కృతికి నవీన హంగులను చేర్చి నిర్మితమవుతున్న ఈ ఆలయంలో విదేశాల నుంచి కూడా చాలా వస్తువులను దిగుమతి చేసుకోవడం జరిగింది. దాదాపు దశాబ్దం క్రితం ఈ ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా కట్టడాల కోసం ఇప్పటి వరకు రెండు కోట్ల కిలోలకు పైగా సిమెంట్‌ను వాడారు. బహుళ అంతస్తులలో ప్రార్థనా మందిరాలు ఉండనున్నాయి.

ఒక్కో అంతస్తు ఒక లక్ష చదరపు అడుగుల వైశాల్యంలో దాదాపు 10,000 మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా వీటి నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత భారీ గోపురం ఈ ఆలయంలో నిర్మించారు. వేద విజ్ఙానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచే ఉద్దేశంతో ఈ వేద ప్లానిటోరియం నిర్మించినట్లు ఆలయ మేనేజింగ్ డైరెక్టర్ సదాభుజ దాస్ తెలిపారు. 380 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రత్యేకంగా నీలం బొలీవియన్ పాలరాతిని ఉపయోగించినట్లు ఆయన చెప్పారు. తూర్పు, పాశ్చాత్య దేశాల సమ్మిళితమే ఈ ఆలయ శిల్పసౌందర్యమని ఆయన వివరించారు. వియత్నాం నుంచి పాలరాతిని దిగుమతి చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ఆలయంలో పూజ మందిరం అంతస్తు వైశాల్యం 2.5 లక్షల చదరపు అడుగులని, అలాగే ప్రధాన ఆలయం ఉన్న అంతస్తు వైశాల్యం 60 చదరపు మీటర్లని ఆయన చెప్పారు. మూలవిరాట్టుల విగ్రహాలు ఎంతో విశిష్టంగా ఉండనున్నట్లు ఆయన వివరించారు. 20 మీటర్ల పొడవైన వేద షాండిలైర్లు అమర్చుతున్నట్లు దాస్ తెలిపారు. శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థానమైన మాయాపూర్‌లో ప్రపంచాన్ని ఆకట్టుకునే ఒక విశిష్టమైన ఆలయాన్ని నిర్మించాలని ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆచార్య ప్రభుపాద అభిలషించారని ఆయన కోర్కె మేరకు ప్రపంచంలోనే అద్భుతమైన రీతిలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోందని సుబ్రతో దాస్ చెప్పారు. కుల, మతాలకు అతీతంగా భక్తులు ఎవరైనా ఈ ఆలయాన్ని సందర్శించి పార్థనలు, నృత్యాలు, ధ్యానం చేయవచ్చని ఆయన వివరించారు. ప్రస్తుతం మాయాపూర్‌ను ఏటా దాదాపు 70 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఈ ఆలయం ప్రారంభమైన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఈ నగరం ఆకట్టుకోగలదని ఆయన ఆకాంక్షించారు.

Worlds largest temple at Mayapur, Temple of Vedic Planetarium in Nadia district of West Bengal has multiple firsts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News