Thursday, April 25, 2024

తొలి రోజు వర్షానిదే!

- Advertisement -
- Advertisement -

WTC Final First Session cancelled due to Rain

 

ఎడతెరిపి లేని వానతో మొదటి రోజు ఆట రద్దు
డబ్లూటిసి ఫైనల్‌కు వరుణుడి దెబ్బ

సౌతాంప్టన్: ఊహించిందే జరిగింది. భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసిసి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి వర్షం అడ్డంకిగా మారింది. శుక్రవారం తొలి రోజు ఎడతెరిపి లేని వర్షం కురువడంతో కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు. భారీ వర్షం వల్ల మైదానం తడిసి ముద్దవ్వడంతో తొలి రోజు ఆటను పూర్తిగా రద్దు చేశారు. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. వారు హెచ్చరించినట్టే శుక్రవారం ఆట ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. చాలా సేపటి వరకు ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. కాగా, భారీ వర్షం కురవడంతో తొలి సెషన్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఆ తర్వాత కూడా వర్షం కురుస్తూనే ఉంది.

అయితే టివిరామ సమయానికి ముందు కాస్త వర్షం తగ్గింది. దీంతో మ్యాచ్ నిర్వహణపై ఆశలు చిగురించాయి. కానీ మైదానమంతా వర్షంతో నిండి పోవడంతో ఆట సాధ్యం కాలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక శనివారం రెండో రోజు కూడా వరుణుడి ప్రమాదం పొంచి ఉంది. రానున్న 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం కూడా ఆట జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇదిలావుండగా డబ్లూటిసి ఫైనల్‌కు ఐసిసి ముందుగానే రిజర్వ్‌డేను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆరో రోజు కూడా ఆటను నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐసిసిపై అభిమానులు ఫైర్

ఇంగ్లండ్‌లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తీసుకున్న నిర్ణయాన్ని క్రికెట్ అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జూన్ నెలలో ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులో ఆటకు అనుకూలంగా ఉండవని తెలిసి కూడా ఐసిసి ప్రతిష్టాత్మకమైన డబ్లూటిసి ఫైనల్‌ను ఇక్కడే నిర్వహించాలని ఐసిసి భావించడం విడ్డూరంగా ఉందని వారు విమర్శిస్తున్నారు. జూన్ నెలలో ఇంగ్లండ్‌లో భారీ వర్షాలు కురవడం సర్వ సాధారణం. ఈ విషయం తెలిసి కూడా ఫైనల్ కోసం ఇంగ్లండ్‌ను వేదికగా ఎంపిక చేయడాన్ని వారు దుమ్మెత్తి పోస్తున్నారు.

గతంలో ఇంగ్లండ్‌లో జరిగిన పలు ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు. 2013, 2017 చాంపియన్స్ ట్రోఫీలతో పాటు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అన్ని తెలిసి కూడా తప్పులు చేయడం ఐసిసికి పరిపాటిగా మారిందని అభిమానులు విమర్శిస్తున్నారు. ఇంకొందరు అయితే సరదా మీమ్స్‌తో ఐసిసిను ఓ ఆట ఆడుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News