Home అంతర్జాతీయ వార్తలు చైనా ఆసుపత్రి డైరెక్టర్‌ను కాటేసిన కరోనా

చైనా ఆసుపత్రి డైరెక్టర్‌ను కాటేసిన కరోనా

Hospital Director

 

మృతుల సంఖ్య 1871… కొత్తగా 72వేల మందికి వైరస్

బీజింగ్ : చైనాలో భీకర కరోనాతో వూహాన్‌లోని ఆసుపత్రి డైరెక్టర్ మృతి చెందారు. కరోనా వైరస్‌కు వూహాన్ కేంద్ర బిందువు అయింది. దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మంగళవారానికి 1,871కి చేరింది. కోవిడ్ 19 పాథోజెన్‌గా వ్యవహరిస్తున్న కరోనా లక్షణాలు మరో 72,500 మందికి సోకినట్లు నిర్థారణ అయింది. వీరిలో 11,741 మంది తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురి అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో సరైన పురోగతి లేని విషయం అంతకంతకు విస్తరిస్తోన్న వైరస్‌తో స్పష్టం అయింది.

డిసెంబర్‌లో తొలి కరోనా కేసు నమోదయిన హ్యూబెల్ ప్రాంత రాజధాని వూహాన్‌లో ఇప్పటివరకూ వైరస్ సోకిన వారిసంఖ్య 59989కి చేరింది. వీరిలో 1789 మంది మృతి చెందారు. వూహాన్‌లోనే కరోనా ప్రభావం ప్రాణాంతకం అయిందని ఈ విషయం స్పష్టం చేసింది. వూహాన్‌లోని వూఛాంగ్ హాస్పిటల్ సంచాలకులు, న్యూరో సర్జన్‌కు సోకిన కరోనా చివరికి ఆయన ప్రాణాలను కూడా హరించింది. మంగళవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు అధికారిక వార్తా సంస్థలు నిర్థారించాయి. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్‌కే వైరస్ ఏ విధంగా సోకిందనే వెల్లడికాలేదు. ఈ ఆసుపత్రి అత్యున్నత స్థాయి ప్రామాణిక ఆసుపత్రిగా నిలిచింది.

వూహాన్‌లో కరోనా చికిత్సకు ఎంపిక చేసిన ఏడు ప్రభుత్వ ఆసుపత్రులలో ఇది ఒక్కటిగా ఉంది. డిసెంబర్‌కు ముందుగానే ఈ వైరస్ గురించి అధికార యంత్రాంగానికి హెచ్చరికలు పంపించిన వూహాన్ వైద్యుడు 34 ఏండ్ల లీ వెన్‌లియాంగ్‌పై అధికారులు కేసులు పెట్టి వేధించారు. అయితే తరువాత ఆయనకే వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన తరువాత ఉన్నత స్థాయి వైద్యాధికారి ఒకరు ఈ వైరస్ కాటుకు బలి కావడంతో వైద్య చికిత్సా సిబ్బందిలో కలకలానికి దారితీసింది. అయితే వైరస్ అదుపులో పెట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు, మృతుల సంఖ్య అదుపులోకి వచ్చినట్లు చైనా ఉన్నతాధికారులు ప్రకటనలు వెలువరించారు.

కోలుకుంటున్న భారతీయులు
జపాన్ తీరంలో నిలిపివేసిన క్రూయిజ్ నౌకలో కరోనా సోకిన ఆరుగురు భారతీయులు క్రమేపీ కోలుకుంటున్నారు. వారు వైద్య చికిత్సలకు సరైన విధంగా స్పందిస్తున్నట్లు టోక్యోలోని భారతీయ ఎంబస్సీ అధికారులు తెలిపారు. ఈ నౌకలో ఓ వైపు మరో 88 మందికి వైరస్ లక్షణాలు కన్పించాయి. దీనితో ప్రయాణికులలో కరోనా రోగగ్రస్తుల సంఖ్య మొత్తం మీద 542కు చేరుకుంది. జపాన్ తీరంలో నిలిపివేసి ఉన్న ఈ నౌక నుంచి తమ దేశస్తులను స్వదేశానికి తీసుకువెళ్లేందుకు బ్రిటన్ ఏర్పాట్లు చేసింది. విమానాన్ని ఏర్పాటు చేసి వారిని తరలిస్తున్నారు.

Wuhan hospital director dies from novel coronavirus