Thursday, April 25, 2024

టిబెట్ మిలిటరీ ఉన్నతాధికారులతో జిన్‌పింగ్ సమావేశం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(68) టిబెట్‌లోని మిలిటరీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్‌టైమ్స్ శనివారం వెల్లడించింది. టిబెట్‌లో దీర్ఘకాలిక సుస్థిరత, సంపదపై దృష్టి సారించాలని సైనికాధికారులకు జిన్‌పింగ్ సూచించినట్టు ఆ పత్రిక పేర్కొన్నది. రాజధాని లాసాలో టిబెట్ మిలిటరీ కమాండ్ ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో యుద్ధ సన్నద్ధతతో కూడిన పూర్తిస్థాయి శిక్షణ సైన్యానికి అవసరమని జిన్‌పింగ్ సూచించారు. చైనా సైన్యం(పిఎల్‌ఎ)లో ఓ భాగంగా ఉండే టిబెట్ మిలిటరీ కమాండ్ ఆ దేశ రక్షణ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. టిబెట్‌తో ఉన్న భారత సరిహద్దుల్లోనూ కమాండ్ సైనికులే విధులు నిర్వహిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలోని టిబెట్ ప్రాంతాల్లో జిన్‌పింగ్ జరిపిన పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచి శుక్రవారమే వెల్లడించిన విషయం తెలిసిందే. భారత సరిహద్దులకు సమీప పట్టణమైన న్యీయింగ్‌చీలోనూ జిన్‌పింగ్ పర్యటించారని వెల్లడైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు టిబెట్ ప్రాంతాల్లో జిన్‌పింగ్ పర్యటించారు. చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టిబెట్‌లో జిన్‌పింగ్ పర్యటించడం ఇదే మొదటిసారి. న్యీయింగ్‌చీ సున్నితమైన, వ్యూహాత్మక ప్రాంతం కావడంతో జిన్‌పింగ్ పర్యటనను చివరి వరకూ గోప్యంగా ఉంచినట్టు భావిస్తున్నారు.
జిన్‌పింగ్ చైనా అధ్యక్ష పదవితోపాటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సిపిసి) ప్రధాన కార్యదర్శిగా, ఆ దేశ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవి మూడూ ఆ దేశంలో కీలక పదవులన్నది గమనార్హం. భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతం తూర్పు లడఖ్‌లో ఏడాది కాలంగా ఇరు దేశాల సైన్యం మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఇంకా పూర్తిగా సడలిపోకముందే జిన్‌పింగ్ టిబెట్‌లో పర్యటించడాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. టిబెట్‌లోని బౌద్ధుల విషయంలో చైనా, భారత్ మధ్య దీర్ఘకాలికంగా విభేదాలు నెలకొన్నాయి. టిబెట్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని చైనా జీర్ణించుకోలేకపోవడం గమనార్హం. టిబెట్ హిమాలయ ప్రాంతంలోని బౌద్ధులకు మత స్వేచ్ఛ లేకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారన్న విమర్శలు అంతర్జాతీయంగానూ చైనాపై ఉన్నాయి. ఆ విమర్శల్ని చైనా తిరస్కరిస్తోంది. ప్రజల మతపరమైన విశ్వాసాల్ని గౌరవిస్తామని, మత వ్యవహారాలలో వారికి స్వతంత్రత, స్వయం పాలనాధికారం ఉంటుందని జిన్‌పింగ్ తన టిబెట్ పర్యటన సందర్భంగా అన్నట్టు గ్లోబల్‌టైమ్స్ పేర్కొన్నది.

Xi Jinping meets Top Tibetan Army Officers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News