Home ఎడిటోరియల్ ప్రాణాంతక ప్రణాళికలు

ప్రాణాంతక ప్రణాళికలు

New-Cartoon

సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం ముంబై ప్రజలు ఎల్ఫిన్ స్టోన్ రోడ్ రైల్వే స్టేషన్ నడకదారి వంతెన మీద తొక్కిసలాటలో 22మంది మరణించారు అన్న భయంకరమైన దుర్వార్త విన్నారు. మరో వ్యక్తి ఆ తర్వాత మరణించడంతో మృతుల సంఖ్య 23 అయింది. మృత్యువాత పడ్డవారు ఆఫీసులకో, తాము పని చేసే వాణిజ్య సముదాయాలకో హడావుడిగా వెళ్తున్న వారే. ఈ వాణిజ్య సముదాయాలు గత పదేళ్ల కాలంలో మూతపడిన మిల్లుల ప్రాంతంలో వెలిసినవే. ఆ వంతెన చాలా ఇరుకైంది. మరో వేపున వర్షం కురుస్తోంది. ఆ స్టేషన్ చేరుకున్న రైళ్లలోని జనాలు కూడా హడావుడిగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగి ఆ వంతెన 23 మంది పాలిటి మృత్యువంతెనగా మారింది. ఈ ప్రమాదం అనేక స్థాయుల్లో లోపాలను బహిర్గతం చేసింది. విపత్తులు సంభవించినప్పుడు ఆదుకునే సదుపాయం సవ్యంగా లేకపోవడం ఇందులో ప్రధాన సమస్య. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదు. ఇలాంటి ప్రమాదాలు అలవాటుగా మారిపోయాయి. దేశంలోని అనేక నగరాలలో జరుగుతూనే ఉన్నాయి. నిజానికి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. అలా జరగక పోవడమే విషాదం.

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై దశాబ్దకాలం కిందటే ఇక విస్తరించడానికి వీలులేనంతగా పెరిగిపోయింది. కాని కొత్తగా వెలుస్తున్న జనావాసాల నుంచి ప్రజలు తాము పనిచేసే చోట్లకు వెళ్లడానికి కావాల్సిన రవాణా సదుపాయాలు మాత్రం అవసరానికి తగినంతగా లేవు. ఉన్న చోట విపరీతమైన రద్దీ ఉంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి వ్యవస్థ, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్, రైల్వేశాఖ మధ్య సమన్వయం లేక పోవడంతో ఈ సమస్య మరింత వికృత రూపం దాలుస్తోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న మరిన్ని మెట్రో రైళ్లు, మోనో రైలు స్టేషన్ల వల్ల రద్దీ మరింత పెరగక తప్పదు. అదీగాక ప్రతిపాదనలో ఉన్న ముంబై నూతన అభివృద్ధి పథకం 80లక్షల మందికి ఉపాధి కల్పించడం కోసం అదనపు మెట్రోరైలు పథకాలు, వివాదాస్పదమైన సముద్ర తీరం వెంట రోడ్డు మార్గ నిర్మాణం మీద దృష్టి కేంద్రీకరించింది. రైలు మార్గాల మీద ఉన్న ఒత్తిడి తొలగించడానికి ఈ ఆలోచనలు చేస్తున్నారు. కాని వీటి వల్ల పెరిగే జనాభా, వాహనాల సంఖ్య వల్ల తీరే సమస్య ఏమీ ఉండదని రవాణా రంగ నిపుణులు అంటున్నారు. ముంబై తూర్పు ప్రాంతంలోని శివారు బస్తీల్లోనూ ప్రతిపాదించిన మోనో రైలు సైతం ఒత్తిడి తగ్గించే అవకాశం కనిపించడం లేదు. నిపుణుల అభ్యంతరాలను పరిగణించనూ లేదు. సబర్బన్ రైలు మార్గాల ద్వారా సామర్థ్యాన్ని పెంచడం అన్న ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లక్ష్యం నెరవేరలేదు.

ముంబైకి ఉన్న విశిష్ట లక్షణాలన్నీ సబర్బన్ రైలు మార్గాలతోనే ముడివడి ఉన్నాయి. ఈ రైళ్లు దాదాపు 22 గంటల పాటు నడుస్తాయి కనక మహిళల రాకపోకలకు అనువుగా ఉన్నాయి. ఆ రైళ్లలో భద్రత కూడా ఉంది. ఆ రైలు ప్రయాణం విస్తృతమైందే కాక చాలా చౌక. కార్మికులు, ఆఫీసుల్లో పనిచేసే వారు కూడా ఈ రైళ్లల్లో ప్రయాణిస్తారు. స్వయం ఉపాధి చూసుకునే వారు ఆ రైళ్లల్లోనే సకలమూ అమ్ముతారు. పూలు, కూరగాయలు, సేఫ్టీ పిన్నులు, పళ్లు, పుస్తకాలు అన్నీ అమ్ముతారు. నదుల సరసన నాగరికత విలసిల్లినట్టుగా జనావాసాలు, వాణిజ్య సముదాయాలు ఈ రైలు మార్గాల పరిసరాల్లోనే వెలిశాయి. భారీ భవనాలు, మురికి వాడలు, అంగళ్లు కూడా ఏర్పడ్డాయి. అయితే సమస్య ఏమిటంటే ఈ పెరుగుదల ప్రణాళికా బద్ధంగా, నియంత్రిత పద్ధతిలో జరిగింది కాదు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆకాశ హార్మ్యాలు వెలిశాయి. వాటిలో నివసించే వారు తండోపతండాలుగా ఇరుకైన వీధుల్లోకి, రోడ్లలోకి ప్రవేశించాల్సి వస్తోంది.

ఫలితంగా లక్షలాది మంది ప్రతి రోజూ ఊపిరాడనంతటి రైల్వే కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించాలి. పాత వంతెనల మీదుగా వెళ్లాలి. దీనికి తోడు వారు ముంబై మర్యాదలను, లాఘవాన్ని పాటించాలి. కష్టాలు పడాలి. ఒక్కో సబర్బన్ రైలులో 1700 మంది ప్రయాణించడానికి అవకాశం ఉండగా సగటున 4,500 మంది ప్రయాణిస్తుంటారు. అయినా రోజూ ప్రయాణించే 75 లక్షల మందికి ఇవి ఏ మూలకూ చాలడం లేదు. పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే పరిధిలో, హార్బర్ లైన్లో కూడా అనేకమంది రైలు పెట్టెల్లోంచి పడి మరణిస్తుంటారు. పట్టాలు దాటుతూ కూడా మృత్యువాత పడుతుంటారు. కాలి నడక వంతెనలు ఉండాల్సినన్ని లేవు. ఉన్నవి పాతబడి పోయాయి. లేదా ప్లాట్ ఫాం కు ఏదో ఒక చివరలో ఉంటాయి. అందువల్ల పట్టాలు దాటి వెళ్లడమే సులువు అనుకుంటారు. దాదాపు రోజూ పది మంది ప్రాణాలు కోల్పోతుంటారు. 2016లో 3,202మంది మరణించారు. 3,363 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ప్రమాదాల్లో 1,618మంది మరణించారు.

సమస్యలు అనేకం. పరిష్కారాలు పరిమితం. రైలు మార్గాలను సవ్యంగా నిర్వహించడం, సిగ్నల్ వ్యవస్థను మెరుగు పరచడం, సబర్బన్ రైళ్లకు స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు, రైల్వేల మీద ఒత్తిడి తగ్గించడానికి బహువిధ రవాణా సదుపాయాలు కల్పించడం, తూర్పు-పడమరల మధ్య రవాణాకు ఉపయోగపడే ఏర్పాట్లు చేయడం వంటి అనేక సమస్యలున్నాయి. ఒకప్పుడు నిరసనలకు పేరుపడ్డ ముంబై వాసులు ఇప్పుడు ‘సర్దుకు’ పోతున్నారు. ప్రజల అవసరాలకు తగ్గ ప్రణాళికలు రూపొందించాలని, పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలించాలని ముంబై పౌరులు రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెంచాలి.

* (ఇ.పి.డబ్ల్యు. సౌజన్యంతో)