బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప మనవరాలు (30) సౌందర్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరు సెంట్రల్ బిజినెస్ జిల్లాలోని వసంత్‌నగర్ అపార్ట్మెంట్లో ఆమె ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. యడియూరప్ప రెండో కుమార్తె పద్మావతి కూతరు సౌందర్య. శుక్రవారం ఉదయం సౌందర్య భర్త ఆస్పత్రి విధులకు వెళ్లారు. అనంతరం సౌందర్య పనిమనిషి, తన కుమార్తెతో పాటు ఇంట్లోనే ఉన్నారు. కాసేపటికి తన గదిలోకి వెళ్లి సౌందర్య గడియవేసుకుంది. ఆల్పాహారం ఇచ్చేందుకు పనిమనిషి సుమారు 9గంటల సమయంలలో డోర్ కొట్టడంతో లోపలి నుంచి స్పందనలేదు.
మళ్లీ మళ్లీ డోర్ కొట్టినా ఎంతకూ లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో సౌందర్య భర్త నిరంజన్‌కు పని మనిషి సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే ఫోన్ కాల్ చేసినప్పటికీ సౌందర్య నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. తనవద్ద నున్న మరో తాళం చెవితో తలుపులు తీశారు. సౌందర్య ఉరివేసుకుని కనిపించడంతో ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, ఆప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సౌందర్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసి, శవపరీక్ష కోసం బౌరింగ్ ఆసుపత్రికి పంపినట్టు పోలీసులు తెలిపారు.
సౌందర్య తన తొమ్మిది నెలల పాప, వైద్య వృత్తిలో ఉన్న తన భర్త నిరంజన్‌తో అపార్ట్మెంట్లో ఉంటున్నారు. 2018లో నిరంజన్, సౌందర్యల వివాహం జరిగింది. ఇద్దరు స్థానిక ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. గర్భందాల్చినప్పటికీ నుంచి సౌందర్య బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ఆయితే, ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. సౌందర్య కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయినందున వారిని తాము ప్రశ్నించ లేకున్నామని, అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత కేసు సమగ్ర దర్యాప్తు జరుపుతామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Former CM Yediyurappa grand daughter commits suicide