Home ఆఫ్ బీట్ ఆ ‘యోగ’మే ఆరోగ్యం

ఆ ‘యోగ’మే ఆరోగ్యం

‘తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్’ అని ఓ కవి చెప్పినట్లు ఒకప్పుడు పనికి ఎంత ప్రాధాన్యతనిచ్చేవారో తిండికీ అంతే విలువను ఇచ్చేవారు. మరి ఇప్పుడో ఏదో తింటున్నాం, పడుకుంటున్నామంటూ మమ అనిపిస్తున్నారు.తింటే నీరసం తినకపోతే ఆయాసం ..అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు తిన్నా తినకపోయినా నీరసమే. ఆన్‌లైన్ ఫుడ్, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, టివిల ముందు గంటల తరబడి కూర్చోవడాలు…ఇక వ్యాయామం అసలు దాని జోలికే వెళ్లనివారు చాలా మంది..పోనీ తినే తిండిలో పోషకాలు ఉన్నాయా అంటే అంత సీన్ ఉండదు. మంచి ఆహారం అంటే ఏంటో కూడా మరిచిపోయినవారున్నారు. పెద్ద హోటల్లో బాగా ఖరీదైన ఫుడ్డే బెస్ట్ అనే రోజులు నడుస్తున్నాయి. మరి రోగాలు కూడా అంతే రేంజ్‌లో వస్తున్నాయి…వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే పోషకాహారం ఏంటి, వాటి వల్ల లాభాలేంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి…

Yoga

యోగాతో రోగాలు దూరం…

శరీరం రోగాల పుట్టగా మారడానికి కారణం చాలా వరకు మనం చేసే నిర్లక్షమే.  సరైన తిండి, వేళకు నిద్ర, శరీరానికి వ్యాయామం లేకపోవడమే.  ఏమన్నా అంటే అస్సలు టైంలేదు. తినడానికే సమయంలేదు ఇంక ఇవన్నీ ఎక్కడ అంటాం.. మరి ఆరోగ్యమే మహాభాగ్యం కదా!  ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నా, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, మేడలు మిద్దెలు కట్టుకోవాలన్నా …ఇవన్నీ చేయాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలిగా.  శరీరం దేవాలయం లాంటిది. దాన్ని సక్రమంగా చూసుకోకపోతే అది మన మాట వినదు. అందుకే పతంజలి మహర్షి శారీరక ఆరోగ్యానికి చక్కని యోగాసనాల్ని మనకు అందించాడు.  పరిపూర్ణ ఆరోగ్యం కోరుకునే ప్రతిఒక్కరూ వారానికి మూడు రోజులు యోగాసనాలను దైనందిన కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలి.  ప్రతి ఆసనం ప్రత్యేకించి ఒక్కో జాడ్యాన్ని లక్షంగా చేసుకుని పనిచేస్తుందని అంటున్నారు యోగా నిపుణులు.  ఏఏ సమస్యలకు ఏమేం ఆసనాలు వేయాలో తెలుసుకుందాం…

ఉదయాన్నే నిద్ర లేవడం అనేది దాదాపు సగంలో సగం మందికి పైగా అలవాటు లేదు. దానికీ ఓ కారణం ఉంది. రాత్రి పొద్దుపోయేవరకు ఉద్యోగ బాధ్యతలు..సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు…ఇలా ఒకరేమిటి అందరికీ వేళాపాళాలేని ఉద్యోగ విధులు. సరైన తిండి తినరు. సరైన నిద్ర ఉండదు. దాదాపు అందరికీ టెన్షన్‌తో కూడిన కలత నిద్రలే. మన దేశంలో చాలా మంది అయితే బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏంటో కూడా మరిచిపోయినట్లున్నారు. ముఖ్యంగా మహిళలు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినరు. ఏకంగా మధ్యాన్నం లంచ్ చేసేస్తారు. అదేంటి అంటే .. పనితోనే సరిపోతుంది. తినడానికి టైం లేదు అంటుంటారు. తీరా ఆ ఎఫెక్ట్ శరీరంపై పడితే కానీ అర్థం చేసుకోరు. ఈలోగో జరగాల్సింది జరిగిపోతుంది. బిపిలు, షుగర్‌లు వచ్చేస్తాయి. రోగాలు తగ్గించుకోడానికి ఆస్పత్రుల చుట్టూ తిరగడం, మందులు మింగడం, డబ్బు ఖర్చుపెట్టడం జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తే సరిపోతుంది.

న్యూట్రిషన్ వీక్ ఎందుకు..

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో నేషనల్ న్యూట్రిషన్ వీక్‌ను జరుపుకుంటున్నాం. మనిషి తన భవిష్యత్తును అందంగా మలుచుకోవాలంటే సరైన పోషకాహారం తప్పనిసరి అనే విషయాన్ని ప్రచారం చేయడమే ఈ వారం ఉద్దేశం. ఈ అవగాహనా కార్యక్రమాలను 1982లో కేంద్రప్రభుత్వం మొదలు పెట్టింది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్‌తో కలిపి 43 యూనిట్లు ( డిపార్ట్‌మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్, హెల్త్ అండ్ ఎన్‌జీవోస్ ) కలిపి దేశం మొత్తం మీద పనిచేస్తున్నాయి. పోషకాహారం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ వారాన్ని ఏర్పాటుచేశారు. పోషకాహారంపై అవగాహన కల్పించడం కోసం రోడ్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. పుట్టినబిడ్డకు మొదటి ఆర్నెల్లు తల్లి పాలు తప్పనిసరి అని బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు.

పోషకాహార లోపంతో అన్నీ సమస్యలే…

శరీరం బరువు పెరిగినా, తగ్గినా రెండూ సమస్యలే. చిన్నా పెద్దా కంపెనీల్లో పనిచేసేవారికి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని గురించి అవగాహన అవసరం. ఈరోజుల్లో ప్రతి సంస్థా తమ ఉద్యోగులను పనిలో చాలా ఒత్తిడికి గురిచేస్తున్నాయి.పనిగంటలు పెంచుకుంటూ పోతున్నారు. కష్టమైన టాస్క్‌లు ఇస్తుంటారు. మళ్లీ వాళ్లు చేసే పనికి ఒక డెడ్‌లైన్ పెట్టడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తిండి, నిద్రను పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తున్నారు. చాలా సంస్థల్లో కనీసం 13, 14 గంటలు పనిగంటలు పనిచేస్తున్నారంటే ఆశ్యర్యపోకమానం. అలాంటప్పుడు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది. సరైన ఆహారం, సరైన నిద్ర కచ్చితంగా ఉండాలి. పనికంటే ఆరోగ్యమే ముఖ్యమని వైద్యులు మొత్తుకుంటున్నారు.

పేదరికం ఓ శాపం: దేశంలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు. తిండిలేక అల్లాడుతున్నారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారి ఆకలిని తీరుస్తున్నాయి. ఉండి కూడా సరైన తిండి తినకుండా, నిర్లక్షం చేస్తున్న వారు ఈ విషయాన్ని గమనించాలి.

డైట్ ప్లాన్

కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు చాలా మంది తమ ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచు కునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం విటమిన్ మాత్రలు, అనేక రకాల పౌడర్లు వాడుతున్నారు. తమ శక్తికి మించి పనిచేసే ఉద్యోగులకు వీటితో సరిపోదు. పనిలో పడి లేదా పని ఒత్తిడి వల్ల తిండిని నిర్లక్షం చేసే వారే ఎక్కువ మంది కనిపిస్తుంటారు. వేళకు తిండి తినకపోవడం చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రణాళికలు వేసుకోవడం ద్వారా సరైన డైట్‌ను పాటించవచ్చు. టైం టేబుల్‌లో చెప్పినట్లు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను ఎప్పుడు ఏ టైంకి తినాలో ప్రతిరోజూ అదే సమయానికి తినేలా చూసుకోవాలి. రాత్రిపూట త్వరగా డిన్నర్ పూర్తిచేయాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి కనీసం నాలుగ్గంటల సమయం తీసుకుంటుంది. అది శక్తిగా మారుతుంది. దాన్ని బట్టి ప్రజలు లంచ్, డిన్నర్‌లను అలాగే తీసుకోవాలి. వీరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు వైద్యులు.

సంప్రదాయ వంటల్లో పోషక విలువలు:

అమ్మచేతి వంట అమృతం అని ఊరికే అనలేదు. శుచిగా, శుభ్రంగా వండిపెట్టే ఇంటి వంటను ఇప్పటివారు పెద్దగా ఇష్టపడటం లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి ఫుడ్ తెప్పించుకోవడం ఎక్కువైంది. దానికి తగ్గట్లే ఆరోగ్యం చెడిపోవడం కూడా ఎక్కువౌతోంది. ఇంట్లో తయారుచేసుకునే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు , మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. పొటాషియం, సోడియం లాంటివి శరీరంలోని ఎలక్ట్రోలైట్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలకు మంచి ఆహారమేదో చెప్పాలి. పోషకాహారంతో కూడిన పదార్థాలను అలవాటు చేయాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. వారికి చిరుతిండి కావాల్సివచ్చినప్పుడు సలాడ్స్, నట్స్ లాంటివి తినడం నేర్పించాలి. లేదంటే చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం బారిన పడతారు.

రోజుకు నాలుగు పలుకులు శరీరానికి కావాల్సిన కీలక పోషకాలైన విటమిన్లు, మినరల్స్ నట్స్‌లో పుష్కలంగా లభిస్తాయి. ఐతే రోజుకు ఎన్ని తినాలి అనేది అందరికీ వచ్చే సందేహం. ఏ రకం నట్స్ అయినా రోజుకు పది గ్రాముల మోతాదులో తింటే చాలు. ఏదైనా ఒకే రకం కాకుండా 3,4 రకాల నట్స్‌ను కలిపి తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు.

వాల్‌నట్స్: రోజుకు 5 నుంచి 6 వరకు తినాలి. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. గుండె సంబంధిత వ్యాధులు రావు. ఎముకలు దృఢంగా మారతాయి. మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. డయాబెటీస్ అదుపులోకి వస్తుంది. గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తుంది. మహిళల్లో రుతు సమస్యలు ఉంటే పోతాయి.

yoga

బాదం: రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మధుమేహరోగులకు మంచిది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రావు. మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి దివౌషధం. తక్కువ మొత్తంలో తిన్నా కడుపు నిండినట్లు ఉంటుంది.

వేరుశెనగ: నిత్యం వంటల్లో వాడుతుంటాం. 10 గ్రాముల మోతాదులో తినాలంటే వీటిని కనీసం రోజుకు 10 నుంచి 15 వరకు తినాలి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది.

పిస్తా : వీటిని నిత్యం 8, 9 పలుకులు తిన్నా చాలు. పిస్తా పప్పు గుండెను పదిలంగా ఉంచుతుంది. బరువు తగ్గుతారు. కండరాల నొప్పులు తగ్గుతాయి. పొడి చర్మం ఉన్నవారు తింటే చర్మం మృదువుగా మారుతుంది. డయాబెటీస్ అదుపులో ఉంటుంది.

జీడిపప్పు: రోజుకు 6,7 తినాలి. గుండె సంబంధ వ్యాధులు రావు. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. రక్తం శుద్ధి అవుతుంది.  కంటి జబ్బులు రావు. కొంచెం ఖరీదు  ఎ క్కువైనా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టొచ్చు.

మధుమేహం…

జీవితంలో ఆనందాన్ని దూరం చేసేది మధుమేహం. కొందరిలో వంశపారంపర్యంగా రావచ్చు.  మరి కొందరిలో జీవనశైలిలో లోపాలవల్ల, ఊబకాయం వల్లా కూడా వస్తుంది. సూర్యనమస్కారాలు, తాడాసనం, తిర్యక్ తాడాసనం, కటి చక్రాసనం, యోగ ముద్రాసనం, గోముఖాసనం లాంటివి చేయాలని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఆహార నియమాల్ని పాటిస్తూ, యోగ ప్రాణాయామం చేస్తే చక్కెర వ్యాధి రాకుండా చూసుకోవచ్చు.

yoga
ఎసిడిటీ…

సకాలంలో తినకపోవడం,జంక్‌ఫుడ్‌ను అతిగా లాగించడం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసు కోవడంలాంటివన్నీ ఎసిడిటీకి దారితీస్తాయి. భోజనం చేసిన తర్వాత ఓ పది నిముషాలు వజ్రాసనం వేయాలి. అందువల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు. కొన్ని సందర్భాల్లో ఎసిడిటీ మానసికమైన ఇబ్బందుల వల్ల వస్తుంది. ధ్యానంతో మనోరుగ్మతను పోగొట్టుకోవచ్చు.

వెన్నునొప్పి

కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత చాలా మందిని పట్టిపీడిస్తోందీ వెన్నునొప్పి.  కూర్చునే పద్ధతిలో లోపాలు, గంటలకొద్దీ కదలకుండా పనిచేయడం వల్ల వెన్నునొప్పి బారినపడుతున్నాం. తాడాసనం, తిర్యక్ తాడాసనం, కటి  చక్రాసనం, భజంగాసనం, శలభాసనం వెన్నునొప్పిని నియంత్రిస్తాయి.

అలసట..

పోషకాహారాన్ని తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల త్వరగా అలసట వస్తుంది.  భుజంగాసనం,  ధనురాసనం, సూర్యనమస్కారాలను క్రమం తప్పకుండా చేస్తే శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది.  యోగ నిద్ర అనేది ధ్యానం లాంటి ఓ ప్రక్రియ.  ఈ ఆసనాలతో పాటు యోగనిద్రనూ చేస్తే మంచిది.

Today is the world yoga day

ఊబకాయం

సకల రుగ్మతలకు మూల కారణం ఊబకాయం. శరీరం బరువు పెరగడమంటే అధిక రక్తపోటుతో పాటు మధుమేహాన్నీ ఆహ్వానించినట్లే. వజ్రాసనం, ఉష్ట్రాసనం, గోముఖాసనం, అర్ధ మత్సేంద్రాసనం, మత్సాసనంలాంటివి  దీనికి సరైన మందు.

బిపి సమస్యలుంటే…

ఆధునిక జీవితంలో ఒత్తిళ్లన్నీ కలిసి బిపి వచ్చేట్లు చేస్తున్నాయి. అధిక రక్తపోటు ఉన్నవారు సుప్రభాత ఆసనాలు, సూక్ష్మవ్యాయామాలు చేయాలి. బిపి తక్కువ ఉంటే సూర్య నమస్కారాలు, తాడాసనం, తిర్యక్ తాడాసనం, కటి చక్రాసనం సాధన చేయాలి.

జంక్‌ఫుడ్ ప్రమాదకరం

జంక్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి, స్థూలకాయం కలుగుతుంది. జంక్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవటం వల్ల శ్వాస సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు, మధుమేహం వంటి ప్రమాదకర వ్యాధులు రావడానికి రెడీగా ఉంటాయి. జంక్ ఫుడ్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలుండవు. కానీ కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల వంటి హానికర పదార్థాలు విపరీతంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు, నూనెలు అధిక మొత్తంలో ఉండటంతో, అవి రక్తనాళాల లోపలి గోడల వైపు పేరుకుపోయి, ఫలకాలుగా ఏర్పడి, రక్త సరఫరాకు అడ్డంకులను ఏర్పరుస్తాయి. ఫలితంగా రక్త పీడనం అధికమై, రక్తం సరఫరా చేసే గుండెకు ఇబ్బందులను కలిగిస్తాయి. ఉప్పు, చక్కెరలు అధిక మొత్తంలో ఉండటం వల్ల, ఇవి ప్లీహ గ్రంధిని ప్రమా దానికి గురి చేసి, ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఫలితంగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

yoga

జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలంటే….

చిరుతిళ్లు తినాలనిపించినప్పుడు పండ్లు, కూరగాయలను సలాడ్‌ల రూపంలో తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నీటిని ఎక్కువగా తాగాలి. శరీర వ్యవస్థలను ఆరోగ్యంగా శుభ్రపరచి, డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది. ప్రతిరోజూ 6 నుండి 8 గ్లాసుల నీటిని తాగటానికి ప్రయత్నించాలి. ఫలితంగా, జీవక్రియ రేటు పెరగటమే కాకుండా, శరీరంలో ఉండే విష, హానికర పదార్థాలు కూడా తొలగిపోతాయి.

వీటిల్లో పోషకాలు మెండు

పోషకాహార లోపం వల్ల ఊబకాయం, హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. మన శరీరానికి ఖనిజాలు, విటమిన్లు, కేలరీలు, కొవ్వులు, ఫైబర్‌లాంటివన్నీ సరైన మోతాదులో అవసరమౌతాయి.అసలు పోషకాలు ఎటువంటి ఆహారంలో దొరుకుతాయో చూద్దాం..
పోషక విలువలున్న ఆహారంలో విటమిన్లు, మినరల్సు, తక్కువ కేలరీలు ఉంటాయి. తక్కువ శాతంలో షుగర్, సోడియం, చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటాయి. శరీరం విటమిన్లు, మినరల్స్‌ను కోరుకుంటుంది. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మన డైట్‌లో పోషకవిలువలున్న ఆహారాన్ని చేర్చుకోవాలి. ఎప్పుడూ ఒకటే రకం కాకుండా అన్ని పదార్థాలను తీసుకోవాలి. అవి పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, తృణధాన్యాలు, నట్స్, పాలు, పాలకు సంబంధించిన పదార్థాలు, గింజలు …వీటన్నింటిలో పుష్కలంగా పోషకాలుంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చు.

కాల్షియం – బ్రకోలీ, పచ్చని తాజా ఆకుకూరలు, పాల ఉత్పత్తులు
పొటాషియం – అరటిపండ్లు, నట్స్, చేపలు, పాలకూర, ముదురు ఆకుపచ్చ కూరగాయలు
ఫైబర్- బీన్స్, తృణధాన్యాలు, ఆపిల్స్, స్ట్రాబెర్రీస్, కేరట్లు, ముదురు రంగు పండ్లు, కాయగూరలు.
మెగ్నీషియం- పాలకూర, నల్లని బీన్స్, ఆల్మండ్స్, కొబ్బరి, ఎండిన ద్రాక్ష, యాపిల్, చెర్రీస్.
విటమిన్ ఎ-గుడ్లు, పాలు, కేరట్స్, చిలగడ దుంపలు, క్యాబేజీ, కాలీఫ్లవర్
విటమిన్ సి- ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, టమోటాలు, బ్రకోలీ, కివి, ముల్లంగి
విటమిన్ ఇ- అవకాడో, నట్స్, సీడ్స్, తృణధాన్యాలు, పాలకూర, ముదురురంగు ఆకుకూరలు. ఇవన్నీ ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవే కాకుండా నీళ్లు, గ్రీన్ టీ వంటి పానీయాల్లో విటమిన్లతోపాటు ఇతర పోషక విలువలు లభిస్తాయి. తృణధాన్యాలు, గోధుమలు ఇతర ఉత్పత్తులు మంచి పోషకాహారాలు.

మల్లీశ్వరి వారణాసి