Home తాజా వార్తలు ఒంటరి మహిళలే టార్గెట్…

ఒంటరి మహిళలే టార్గెట్…

Young man

 

ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్
ప్రైవేట్ పార్ట్‌ను టచ్‌చేసి బైక్‌పై పారిపోతున్న నిందితుడు
ఇంజనీరింగ్ చేసి ఉద్యోగవేటలో ఉన్న యువకుడు
స్థానికుడి ఫిర్యాదుతో పట్టుకున్న పోలీసులు
వేగంగా స్పందించిన రాచకొండ సిపి

హైదరాబాద్ : ఒంటరిగా వెళ్తున్న మహిళలను మోటార్ సైకిల్‌పై వెంబడించి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడిని రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్‌కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. సూర్యపేట జిల్లా, పెన్‌పహాడ్ మండలం, లింగాల గ్రామానికి చెందిన గార్లపాటి శివా రెడ్డి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. తన స్నేహితులతో కలిసి రూములో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి శివారెడ్డి ఒంటరిగా వెళ్తున్న మహిళలు, యువతులను బైక్‌పై వెంబడించి వారి ప్రైవేట్ పార్ట్ అసభ్యంగా తాకి పారిపోతున్నాడు.

ఈ నెల 7వ తేదీన ఎల్‌బి నగర్, శాతవాహన నగర్ కాలనీకి చెందిన చెందిన ఓ యువతి బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా శివా రెడ్డి ముకానికి కర్చీఫ్ కట్టుకుని బైక్‌పై వచ్చి ఆమె వెనుక వైపున ప్రైవేట్ పార్ట్‌ను అసభ్యంగా తాకి పారిపోయాడు. అదే కాలనీకి చెందిన దండి రవి తన ఇంటిముందు ఉండి చూశాడు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పోలీసులను అప్రమత్తం చేసి సంఘటన స్థలానికి పంపించాడు. ఎస్‌ఓటి పోలీసులు అక్కడికి వచ్చి సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి బైక్ నంబర్‌ను గుర్తించారు. హోండా యూనికాన్ నంబర్ టిఎస్29ఎ 1045 అడ్రస్, రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందో ఆర్టిఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సూర్యపేట జిల్లా కోదాడకు చెందిన వల్లపురెడ్డి లక్ష్మి పేరు మీద ఉంది. కాని యజమాని ఆ అడ్రస్‌లో లేదు. బైక్‌ను నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లోని హిందూజా ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఫైనాన్స్ తీసుకుని కొనుగోలు చేసినట్లు ఎస్‌ఓటి పోలీసులు గుర్తించారు. అక్కడి వెళ్లి విచారించగా ఇది తమ కంపెనీలో గతంలో పనిచేసిన వల్లపురెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తన తల్లి పేరు మీద తీసుకున్నట్లు చెప్పారు. అతడే 2017లో మృతిచెందాడని చెప్పారు. అదే కంపెనీలో అతడి బావమరిది సూర్యపేట జిల్లా, బేతోల్ గ్రామానికి చెందిన మోడుగు శ్రీనివాస్ రెడ్డి రెండు వాహనాలు తీసుకుని ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టకుండా తప్పించుకు తీరుగుతున్నట్లు గుర్తించారు. ఎస్‌ఓటి పోలీసులు విచారణ చేయగా ఆ నంబర్‌గల బైక్‌ను తన కుమారుడు మోడుగు రామలింగారెడ్డి వద్ద ఉన్నట్లు తెలిపాడు. తన కుమారుడు ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని సరూర్‌నగర్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపాడు.

స్నేహితుడి బైక్‌తో షికారు…
మోడుగు శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడి స్నేహితుడు గార్లపాటి శివారెడ్డికి ఈ నెల 10వ తేదీన మోటార్‌సైకిల్ ఇచ్చాడని తెలిపాడు. అతడి మొబైల్ నంబర్‌ను సేకరించిన పోలీసులు వేట మొదలు పెట్టారు. రెండు నెలల క్రితం కూడా ఓ మహిళ పట్ల ఇలాగే అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసినట్లు బయటపడింది. నిందితుడు ఎల్‌బి నగర్ వద్ద తిరుగుతుండగా ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సంఘటన జరగగానే అక్కడే ఉన్న రవి స్పందించి డయల 100 ఫిర్యాదు చేసి తన బాధ్యతను నిర్వర్తించినందుకు రాచకొండ సిపి మహేష్ భగవత్ గుడ్ సిటిజన్ అవార్డు, రూ.10,000 నగదు బహుమతి అందజేశారు. రాచకొండ సిపి మహేష్ భగవత్, ఎడిసిపి సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్, అశోక్ రెడ్డి, ఎస్సైలు సత్యనారాయణ, సిబ్బంది పట్టుకున్నారు.

అనుమానాస్పదంగా కనిపిస్తే ఫోన్ చేయండి : సిపి
ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతుంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 9490617111కు ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కాలనీల్లో సిసిటివిలు ఏర్పాటు చేసుకోవాలని, వాటి వల్ల నేరాలకు చెక్‌పెట్టవచ్చని అన్నారు.

Young man has been arrested for Indecent Behavior