Home ఎడిటోరియల్ సంపాదకీయం: యువ తెలంగాణ

సంపాదకీయం: యువ తెలంగాణ

Young Telangana: more youngers in Indiaజనాభాలో, పని చేసే వయసులోని వారి శాతం పెరుగుతున్నదంటే అది ఆ సమాజానికి వరమనే చెప్పాలి. అదే సమయంలో భారమని కూడా గమనించాలి. జనశక్తి భారత దేశానికున్న పరమోతృ్కష్ట బలం. అందులోనూ పని చేసే వయసులోని వారి శాతం అత్యధికంగా ఉండడం చెప్పుకోదగిన సానుకూలాంశం. దేశ జనాభాలో పని చేసే వయసు (1559) లోని వారు మూడింట రెండొంతుల మంది ఉన్నారని, వీరి శాతం 2013 నుంచి క్రమంగా పెరుగుతున్నదని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ( నమూనా నమోదు వ్యవస్థ) 2018వ సంవత్సరం నివేదిక లెక్క తేల్చిందన్న సమాచారం సంతోషదాయకమైనది. ఈ వయసు వారు దేశంలో కెల్లా తెలంగాణలో అత్యధికంగా 70 శాతం వరకూ ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే శాతంలో ఉన్నారని వెల్లడించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో జనాభా పెరుగుదల తీరుతెన్నుల నమూనాలను సేకరించి, విశ్లేషించి నికర సమాచారాన్ని అందించడానికి భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవస్థే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. మొదటిసారిగా 196465 లో కొద్ది రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ పని చేసింది. 196970లో దేశమంతటికీ విస్తరించుకున్నది. అప్పటి నుంచి దాని పని కొనసాగుతోంది. స్థానికంగా ఉండే టీచర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు వంటి వారిని పార్ట్ టైమర్లుగా నియమించి అక్కడ జనన మరణాల సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగిస్తుంది. వారు మచ్చు సమాచారాన్ని సేకరిస్తారు. అలాగే ప్రతి 6 మాసాల కొకసారి వెనుకటి నుంచి జనన మరణాది రీతులపై స్వతంత్ర సర్వే జరిపిస్తుంది. ఈ రెండింటినీ పోల్చి చూసి నివేదికలు సిద్ధం చేస్తుంది. 2018 నివేదిక ప్రకారం గత 10 ఏళ్లలో దేశంలో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.

గ్రామీణ ప్రాంతాల్లో 35 కు, పట్టణ ప్రాంతాల్లో 32కు దిగి వచ్చింది. 1971లో దేశంలో ప్రతి 1000 మంది శిశువుల్లో 129 మంది మరణించగా, ఇప్పుడది 32కి తగ్గిపోయింది. జననాల రేటులో బీహార్ అత్యగ్ర స్థానంలో ఉండగా, అండమాన్ నికోబార్‌లో అతి తక్కువ పుట్టుకలు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు చత్తీస్‌గఢ్‌లో అతి ఎక్కువగా , ఢిల్లీ మహానగరంలో అతి స్వల్పంగా ఉన్నట్టు లెక్క తేలింది. జనాభాలో అదే పనిగా పెరుగుతున్న పని వయసులోని వారిని దేశ సంపద పెంచుకోడానికి, వృద్ధి వికాసానికి సద్వినియోగం చేసుకోగలిగితే దాని వల్ల ఎంతో మేలు జరుగుతుంది. పొరుగునున్న చైనాను అవలీలగా అధిగమించగలుగుతాం. దేశంలోని పని వయసు జనాభాలో సగం మంది ఏ పనీ లేకుండా ఉన్నారని నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక వెల్లడించింది. 201112 లో ఈ వయసు వారిలోని 55.9 శాతం మంది పనుల్లో ఉండగా అది ఇప్పుడు 49.8 శాతానికి పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం దాచిపెట్టిన 201718 ఉద్యోగాల సర్వే నివేదిక నుంచి లీకైన సమాచారం వెల్లడించింది. పని చేస్తున్న శ్రమ శక్తి రేటును లెక్కించినప్పుడు ఈ సర్వే దేశంలోని 1664 ఏళ్ల వయసులోని వారిని పరిగణనలోకి తీసుకున్నది. ఇంకా చదువుకుంటున్నవారిని, గృహిణులను ఈ లెక్కలో గణించలేదు.

201718లో అప్పటికి 45 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం ప్రబలిపోయిందని ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వే నిర్ధారించింది. ఈ రేటు ఇప్పుడు మరింతగా పెరిగి ఉంటుంది. వరుసగా నాలుగు మాసాలు కొనసాగిన లాక్‌డౌన్‌లో పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడి నిరుద్యోగం విపరీత స్థాయికి చేరుకున్నది. మహాత్మ గాంధీ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా గ్రామాల్లోని కార్మికులకు తాత్కాలికంగా అదనపు పనులు కల్పించి ఆదుకుంటున్నా అది తగిన స్థాయి ఉద్యోగ కల్పన కిందికి రాదు. మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో పెంచుకోడానికి పని చేసే వయసులోని వారిని ఉపయోగించుకుంటే అది దేశ ప్రజల కొనుగోలు శక్తిని బాగాఎగబాకిస్తుంది. వృద్ధి రేటు వికాసానికి విశేషంగా తోడ్పడుతుంది. దురదృష్టవశాత్తు దేశ నాయకత్వం ఆ వైపు ఫలవంతమైన వ్యూహాలను సిద్ధం చేసి అమల్లోకి తేలేకపోతున్నదనే విమర్శ ఉన్నది.

‘మేకిన్ ఇండియా’ వంటి పథకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. చైనా నుంచి తరలిపోతున్న బహుళ జాతి పెట్టుబడులను కూడా మనం ఆకట్టుకోలేకపోతున్నాం. అవి తైవాన్, వియత్నాం వంటి దేశాల వైపు పయనిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక పెరిగితే విద్యావంతులైన యువతకు అవకాశాలు ఊపందుకుంటాయి. తెలంగాణలో నీటి పారుదల రంగానికి విశేష ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గ్రామీణ యువతకు ప్రభుత్వం పనులు కల్పించగలుగుతున్నది. హైదరాబాద్ నగరం పెట్టుబడులను ఆకర్షించే అయస్కాంతంగా నిరూపించుకుంటున్నది. పని వయసులోని వారి శాతం పెరగడం ఎంతటి వరమో వారికి చేతి నిండా పని పాట్లు కల్పించి దేశాభివృద్ధికి ఉపయోగించలేకపోతే దాని వల్ల అంత నష్టం కలుగుతుంది. యువత సోమరులుగా మిగిలిపోడానికి, తప్పుదోవలు తొక్కడానికి దోహదం చేసి దేశానికి మరింత శిరోభారాన్ని కలిగిస్తుంది.