Home తాజా వార్తలు వైఎస్సార్ బాటలోనే సాగుతాం : వైఎస్ షర్మిల

వైఎస్సార్ బాటలోనే సాగుతాం : వైఎస్ షర్మిల

YS Sharmila praja prasthanam padayatra in chevella

 

మన తెలంగాణ/చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రం నుంచి తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి హైదరాబాద్ నుంచి చేవెళ్లకు విచ్చేసిన వైఎస్ షర్మిలకు పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున డోలు, వాయిద్యాలు, డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. సభాస్థలికి చేరుకున్నాక సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో కిరాతక సిఎం కెసిఆర్ పాలన రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్ అవినీతి పాలనను పాతి పెట్టేందుకే మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేపడుతున్నామని తెలిపారు. కులం, మతం పేరుతో తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న భారతీయ జనతా పార్టీని తొందరలోనే బొంద పెడుతామన్నారు. కెసిఆర్‌కు అమ్ముడిపోయి కాంగ్రెస్‌ను చీల్చిచెండాడుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్ల పాలన సిఎం కెసిఆర్ ప్రతి వర్గాన్ని దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ రైతులను దగా చేస్తున్నారన్నారు.

దివగంత నేత వైఎస్సార్ బాటలోనే సాగుతాం :
దివగంత నేత వైఎస్సాఆర్ అడుగుజాడలోనే సాగుతానని తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ స్థాపించింది సంక్షేమ, సమానత్వం, స్వయం సంవృద్ధిని అందరికి అందించేందుకే పార్టీని స్థాపించామని ఆమె పునరుద్ఘాటించారు. ఈ పాదయాత్రతో రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుంటామన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని చెప్పారు. దివంగత నేత వైఎస్సాఆర్‌కు అచ్చివచ్చిన చేవెళ్ల నుంచే పాదయాత్రను చేపట్టారని.. అదే ఆనవాయితీని తాను కొనసాగిస్తానని ఆమె వివరించారు. వైఎస్సాఆర్ ప్రవేశపెట్టిన రైతాంగానికి ఉచిత విద్యుత్, జలయజ్ఞం ద్వారా సాగు, తాగునీరు ప్రాజెక్టుల నిర్మాణం, విద్యార్థులకు ఫీజురీఎంబర్స్‌మెంట్, నిరుపేదల వైద్యానికి ఆరోగ్య శ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

వైఎస్సాఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను మళ్లీ అమలు చేయాలంటే తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలన్నారు. ఆదిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో వైఎస్సాఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. చేవెళ్ల సభాస్థలి నుంచి పాదయాత్రగా బయలు దేరి షాబాద్ చౌరస్తాలోని వైఎస్సాఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కందవాడ గ్రామంలోని గ్రామస్తులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కందవాడ గ్రామం నుంచి పాదయాత్ర నక్కలపల్లి గ్రామంలోకి వెళ్లి అక్కడ గ్రామస్తులతో, రైతులతో ముచ్చటిస్తారు. అనంతరం షర్మిల రాత్రి నక్కలపల్లి గ్రామంలోనే ఓ ఫాంహౌస్‌లో బస చేస్తారు.

భారీగా ట్రాఫిక్ జాం..
తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేవెళ్ల మీదుగా బీజాపూర్ హైదరాబాద్ అంతర్‌రాష్ట్ర రహదారి ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామైంది. సుమారు ఏడు నుంచి పది కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్థంభించిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు మండల కేంద్రంలోని ఒకవైపు రోడ్డును పూర్తిగా మూసివేయించి మరోపక్కనుంచి వాహనాల రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగింది. కొంత ట్రాఫిక్‌ను శంకర్‌పల్లి రూట్ మీదుగా మళ్లించారు.

వైఎస్‌ఆర్ కుటుంబానికి చేవెళ్లతో గొప్ప అనుబంధం ఉంది: వైఎస్ విజయమ్మ
డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి చేవెళ్లతో ఎంతో గొప్ప అనుబంధం ఉందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. 18 సంవత్సరాల క్రితం వైఎస్‌ఆర్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కీలక మలుపులు తిప్పి చరిత్ర సృష్టించిందన్నారు. వైఎస్సాఆర్ పాదయాత్రతోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు మార్లు అధికారాన్ని సొంతం చేసుకుందన్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌కు చేవెళ్ల సెంటిమెంట్ కలిసివచ్చిందన్నారు. ఆనాడు వైఎస్సాఆర్ చేవెళ్ల నుంచి పాదయాత్ర అంటే వైఎస్సాఆర్ చెళ్లెలు పట్లోళ్ల సబితారెడ్డి వద్దన్నారు. అంతా శుభం జరగాలనే ఉద్దేశంతో చేవెళ్ల నుంచి పాదయాత్ర వద్దని సబితారెడ్డి చెప్పినా… వైఎస్సాఆర్ మాత్రం చేవెళ్ల నుంచే తన పాదయాత్రను కొనసాగించారని గుర్తు చేశారు.

తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన యజ్ఞానికి, దీక్షకు, పాదయాత్రకు కార్యకర్తలు సమిధలుగా మారారని ఈ ఆశేష జనవాహిని చూస్తేనే అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. షర్మిల కలలుకనే రాజన్య రాజ్యం రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఆ మేరకు కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైఎస్సాఆర్ పార్టీ నాయకులు కొండ రాఘవరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

YS Sharmila praja prasthanam padayatra in chevella