Home అంతర్జాతీయ వార్తలు జగమొండిగా ముగాబే

జగమొండిగా ముగాబే

jimbabwe

గృహ నిర్బంధం నుంచే ప్రతిఘటన
మధ్యవర్తిగా మతపెద్ద కీలక పాత్ర
జింబాబ్వేలో సైన్యం సంయమనం
హరారే : సైన్యం గుప్పిట్లోకి వెళ్లిన జింబాబ్వేలో తన అధ్యక్ష అధికార వికెట్‌ను నిలబెట్టుకోవడానికి వృద్ధ నేత రాబర్ట్ ముగాబే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తిరుగులేని నేతగా సాగిన ముగాబే సైన్యం చేతిలో ఇప్పుడు గృహ నిర్బంధి అయ్యారు. గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా దేశాధ్యక్ష పదవి నుంచి వైదొలుగాలని ముగాబేపై సైన్యం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తోంది. అయితే దీనిని ఆయన ప్రతిఘటిస్తున్నట్లు, అధికారం నుంచి వైదొలిగేది లేదని చెపుతున్నట్లు వెల్లడైంది. ఒక్కరోజు క్రితమే జింబాబ్వే సైన్యం దేశంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ముగాబేకు చుట్టూ ఉన్న దుష్టశక్తుల పనిపెట్టేందుకే తాము తిరుగుబాటు లేకుండా అధికార హస్తగతం చేసుకున్నామని ప్రకటించారు. దీనితో ఇప్పుడు ముగాబే భవిత ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. తానే దేశానికి చట్టబద్ధమైన పాలకుడిని అని, సైన్యం ఆధిపత్యం చెల్లనేరదని ముగాబే వాదిస్తున్నట్లు, ఈ విధంగా ఆయన సైన్యాన్ని ధిక్కరిస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గెరిల్లా మాజీ నేత అయిన ముగాబే తాను జీవిత చరమాంకంలో రాజీపడేది లేదని, అధికారం వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీనితో సైనిక దళ అధికారులకు, ముగాబేకు మధ్య రాజీ కుదిర్చేందుకు ఇప్పుడు మతపెద్ద ఫీడెలిస్ ముకోనోరి మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. ముగాబేను కాకుండా ఆయన చుట్టూ చేరిన క్రిమినల్స్‌ను లక్షంగా చేసుకుని తాము నిర్ణీత లక్షపు చర్యకు దిగామని ఆర్మీ జనరల్స్ చెపుతున్నారు. తమది తిరుగుబాటు కాదని, కేవలం సైనిక పరిమిత చర్య అని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర జింబాబ్వే చరిత్ర అంతా ముగాబేతోనే ముడివడి ఉంది. దీనితో ఆయనకు గౌరవప్రద ఉద్వాసన పలికితే బాగుంటుందని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. ఆఫ్రికాలో పేరొందిన పలు కీలక నేతలలో ముగాబే ఒకరు. ముగాబే గృహ నిర్బంధం ఆయన బదులుగా ఇప్పుడు సైన్యం అధికారం చలాయిస్తున్న దశలో చట్టపరంగా పూర్తి స్థాయిలో అధికార మార్పిడి జరగాల్సి ఉందని సైన్యం భావిస్తోంది. రక్తపాత రహిత అధికార స్థాపన దిశలో సైన్యం పావులు కదుపుతోంది. ముగాబే బదులు రాజకీయులను పదవిలోకి తెస్తారా? లేక సైన్యమే పూర్తి స్థాయిలో పగ్గాలు చేపడుతుందా? అనేది వెల్లడికాలేదు. ముగాబేను ప్రజలు ఆఫ్రికన్లు విమోచన యోధుడిగానే కీర్తిస్తారు. అయితే పాశ్చాత్య దేశాల పాలకులు ఆయన విధానాలు నిరంకుశం అని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేదని మండిపడుతున్నారు. ఎంతో ఎదగాల్సిన జింబాబ్వేను ముగాబే వైఖరే దెబ్బతీసిందనే విమర్శలు ఉన్నాయి.
పదవీచ్యుత ఉపాధ్యక్షుడి పావులు
దేశానికి గతంలో భద్రతా అధికారిగా తరువాత ఉపాధ్యక్షు లుగా ఉన్న ఎమర్సన్ నంగాగ్వా ఈ నెలలోనే ముగాబే ఆగ్రహానికి గురయ్యారు. పదవీచ్యుతుడు అయ్యారు. ఇప్పుడు ఆయననే సైన్యాన్ని అనుకూలంగా మార్చుకుని ముగాబే అనంతర రాజకీయ అధికార వ్యూహరచనకు పాల్పడుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. సైన్యంతో పాటు ప్రతిపక్షాల సహకారం కూడా ఆయన తీసుకుంటున్నట్లు వెల్లడైంది. చాలా కాలంగా క్యాన్సర్ చికిత్సకు బ్రిటన్ ఇతర దేశాలలో చికిత్స పొందుతూ వచ్చిన ప్రతిపక్ష నేత మోర్గాన్ స్వన్‌గిరాయ్ బుధవారమే హుటాహుటిన దేశానికి తిరిగి రావడం పలు ఊహాగానాలకు దారితీసింది. ఇక తాను సైన్యం నిర్బంధంలో ఉన్నానని, కులాసాగా ఉన్నానని ముగాబే తన సన్నిహితుడు దక్షిణాఫ్రికా నేత జాకోబ్ జుమాకు ఫోన్‌లో చెప్పారు. దేశంలో పరిణామాలపై ఆయన పెద్దగా ఆందోళన ఏదీ వ్యక్తం చేయలేదు. ఇక ముగాబే భార్య గ్రేస్ పట్ల ప్రజలలో అభిమానం లేదని వెల్లడైంది. అయితే ఆమెకు పట్టం కట్టేందుకే ముగాబే ఉన్నట్లుండి ఉపాధ్యక్షుడికి ఎసరు పెట్టడం ఇప్పటివరకూ అంతర్గతంగా ఆమెపై ఉన్న అసంతృప్తి రగిలేందుకు దారితీసిందని విశ్లేషిస్తున్నారు. గత రెండేళ్లలో ఆమె అధికార జానూపిఎఫ్ పార్టీ ద్వారా బోలెడు ప్రయోజనాలు పొందారు. గ్రేస్‌ను ఎక్కువ మంది డిస్‌గ్రేస్ అని పిలుస్తుంటారు. తరచూ షాపింగ్‌లకు వెళ్లుతూ ఉండే ఆమెకు షాపింగ్‌ల పిచ్చి అని తిట్టిపోస్తూ ఉంటారు.
అంతా సర్వసాధారణ జీవనం
ముగాబే గృహ నిర్బంధం, సైన్యం చర్య , లోలోన తీవ్ర స్థాయి రాజకీయ ఎత్తుగడలు, పావులు కదపడాలు జరుగుతూ ఉన్నా ఇప్పుడు దేశ రాజధాని హరారేలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఏమి జరగనట్లుగానే ప్రజలు దైనందిన కార్యక్రమాలు సాగిస్తున్నారు. అయితే సైన్యం పహారా, కీలక ప్రాంతాలలో పారాహుషార్‌లు, కదలికలను డేగకన్నులతో చూస్తూ మౌనంగా ఉంటున్న సైన్యం తప్ప హరారే పూర్తిగా ఇంతకు ముందటిలాగానే ఉంది. ఏదో జరిగినట్లుగా ఎక్కడా మచ్చుకైనా దాఖాలాలు లేవు.