Saturday, April 20, 2024

జొమాటోకు గౌరవ్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Zomato co-founder Gaurav Gupta has quit company

కంపెనీ నుంచి వైదొలగిన సహ వ్యవస్థాపకుడు, రాజీనామాపై భావోద్వేగంతో ఉద్యోగులకు లేఖ

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా కంపెనీ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని సంస్థ సిఇఒ దీపేందర్ గోయల్ బ్లాగ్ పోస్ట్‌లో దృవీకరించారు. గుప్తా ఇమెయిల్‌లో తన నిష్క్రమణ గురించి తెలియజేశారు. ‘నా జీవితంలో ఇది కొత్త మలుపు తీసుకుంటుంది. కొత్త అధ్యాయం ప్రారంభిస్తాను. జొమాటోలో ఆరు సంవత్సరాలు కొనసాగిన నేను ఎంతో నేర్చుకున్నాను. జొమాటోను ముందుకు నడిపించేందుకు గొప్ప టీమ్ కల్గివున్నాం. నా ప్రయాణంలో ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకునే సమయం ఇది. ఇది రాస్తున్నప్పుడు నేనెంతో భావోద్వేగానికి లోనయ్యాను’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో గుప్తా పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా జొమాటో వృద్ధిలో గోయల్ సహకారానికి గాను గుప్తా కృతజ్ఞతలు తెలియజేశారు. 2008లో ఫుడీబేగా గోయల్‌తో కలిసి కంపెనీని స్థాపించిన సహ వ్యవస్థాపకుడు పంకజ్ చద్దా 2018లో రాజీనామా చేశారు. గుప్తా 2019లో జొమాటోలో సిఒఒ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా హోదా పొందారు. రూ.9,375 కోట్ల ఐపిఒ లిస్టింగ్‌లో ఆయన కీలకపాత్ర పోషించారు.

ఆయన 2015లో బిజినెస్ హెడ్‌గా కంపెనీలో చేరారు. జొమాటోలో చేరడానికి ముందు గుప్తా ఎటి కీర్నీలో పనిచేశారు. ఆయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గుప్తా కంపెనీ నుంచి వైదొలిగారనే వార్తతో స్టాక్‌మార్కెట్లో జొమాటో షేరు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఓ దశలో కంపెనీ షేరు రూ.150.15 వద్దకు చేరి ఆ తర్వాత రూ.143కు పడిపోయింది. జొమాటో గ్రోసరీ డెలివరీ సేవల వ్యాపారాన్ని మూసివేసిన తర్వాత గుప్తా సంస్థ నుంచి నిష్క్రమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిరాణా వస్తువుల డెలివరీ సేవలను జొమాటో 2021 జూలైలో ప్రారంభించింది. ఇటీవల కాలంలో కిరాణ వస్తువుల ఆర్డర్లు, 15 నిమిషాల్లో డెలివరీ సేవలను నెరవేర్చలేకపోవడం వల్ల ఈ సేవలను మూసివేయనున్నట్టు తన గ్రాసరీ స్టోర్ భాగస్వాములకు ఇమెయిల్ ద్వారా జొమాటో తెలియజేసింది.

ఈ నెల 17 నుంచి జొమాటో గ్రాసరీ డెలివరీ సేవలను మూసివేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జొమాటో అధికార ప్రతినిధి తెలిపిన ప్రకారం, గ్రాసరీ పైలట్‌ను మూసివేయనున్నాం, జొమాటో ప్లాట్‌ఫామ్‌పై ఇతర విధానాల్లో కిరాణా డెలివరీ చేసే యోచన కూడా లేదు. 10 నిమిషాల గ్రాసరీలో అత్యున్నత నాణ్యతా మార్కెట్‌ను గ్రోఫర్స్ కనుగొన్నదని, సంస్థ ఇన్‌హౌస్ గ్రాసరీ ప్రయత్నం కంటే ఆ కంపెనీలో తమ పెట్టుబడులు వాటాదారులకు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతున్నామని ప్రతినిధి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News