Home లైఫ్ స్టైల్ బమ్ చిక్ బమ్ బమ్…జుంబా

బమ్ చిక్ బమ్ బమ్…జుంబా

Zumba-Dance

జుంబా…ఇప్పుడు ఇది మేనియాలా తయారైంది. నగర జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడులు, శారీరక, మానసిక ఆరోగ్యాలను దెబ్బ తీసేస్తున్నాయి. ఉదయం పూట వ్యాయామం తప్పనిసరి అవుతోంది. లేకపోతే చిన్న వయసులోనే టైప్2 డయాబెటిస్ ముప్పు పొంచి ఉంటోంది. కాని వ్యాయామం పేరు చెప్తే దుప్పట్లోంచి అసలు బయటకి రాబుద్ధి కాదు. మరి..కష్టపడకూడదు. కాని బ్రహ్మాండమైన ఫలితం ఉండాలి. ఏంటి ప్రత్యామ్నాయం అంటే జుంబానే…దాని కథా కమామీషు తెలుసుకుందాం.

1990ల ప్రాంతంలో జుంబా డాన్స్ అనే ఒక ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను తయారు చేశాడు కొలంబియన్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ ఆల్బర్ట్ బెటో. ఆతను మామూలు ఎరోబిక్స్‌కి తనకిష్టమైన లాటిన్, సాల్సా, మెరెంగ్యూ మ్యూజిక్‌ను కలిపేసి ఒక ప్రత్యేకమైన డాన్స్ శైలిని కనుక్కున్నాడు. అతని జుంబా డాన్స్ కొలంబియాలో విజయం సాధించేసరికి దానిని అమెరికాకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు వ్యాపారవేత్తలు అతనితో కలిసి జుంబాకు ఒక ప్రపంచస్థాయి ట్రేడ్‌మార్క్ కల్పించారు. జుంబా అనే మాటకి ప్రత్యేకంగా అర్థం ఏమీ లేదు. ఒక బ్రాండ్ నేమ్‌గా ఎంపిక చేశారంతే. వందలు, వేల జుంబా విడియోలు అమెరికాలో అమ్ముడుపోయాయి. జనాల్లో ఆదరణ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా జుంబా ఇన్‌స్ట్రక్టర్లకు డిమాండ్ కూడా పెరిగింది.

జుంబా డ్యాన్స్ అనడం కంటే జుంబా ఫిట్‌నెస్ అనడం సరైంది. క్లాడియా లీటే అనే బ్రెజిల్ పాప్ సింగర్ జుంబా ఫిట్‌నెస్‌కి అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్. జుంబాలో రకరకాల కలగలుపులుంటాయి. డాన్స్, ఏరోబిక్స్ మూవ్‌మెంట్స్‌తో పాటు హిప్ హాప్, సోకా, సాంబ, సాల్సా, మెరెంగ్యూ, మాంబో, స్కాట్స్, ల్యూంజెస్ కూడా కలిపి ఉంటాయి. మొతం 180 దేశాల్లో రెండు లక్షల ప్రదేశాల్లో వారానికి ఒక కోటి యాభై లక్షల మంది జుంబా క్లాసులకు హాజరవుతున్నారు. 2007 కల్లా జుంబా ఫిట్‌నెస్ తదితర ఫిట్‌నెస్ ఫెసిలిటీ చెయిన్లు, సంస్థలతో కలిపి ఫిట్‌నెస్ ప్రచారం చేయడానికి ఒక బృందం తయారయింది. 2007 కల్లా జుంబా ప్రోగ్రామ్, ఉత్తర, దక్షిణ అమెరికాలో, యూరోప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఇలా ఆరు ఖండాలలో ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి 2016 వరకు అన్ని వయసుల వారికోసం జుంబా అందుబాటులో ఉంది.

జుంబా ఫిట్‌నెస్ ఎల్‌ఎల్‌సి ద్వారా లైసెన్స్ పొందిన వారు ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటారు. ఒక జుంబా క్లాసుకి దాదాపు 500 నుంచి 1000 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫాస్ట్‌గా, నెమ్మదిగా రెండు విధాలుగా ఉండే మ్యూజిక్ రిథమ్‌లకు జుంబా చేస్తారు. వివిధ వయసుల వారి కోసం తొమ్మిది రకాల క్లాసులు ఉంటాయి. అప్పుడే ఆరంభించిన బిగినర్స్ కోసం, ఇంకా పెద్దవారికి జుంబా గోల్డ్. జుంబా స్టెప్, శరీరం కింది భాగం దారుఢ్యాన్ని పెంచుతుంది. అది జుంబా రొటీన్స్, లాటిన్ డాన్స్ రిథమ్స్‌తో స్టెప్ ఎరోబిక్స్. ఎవరైతే దానిని టోనింగ్ స్టిక్స్‌తో చేస్తారో వారికి జుంబా టోనింగ్ విడిగా ఇస్తారు. పొట్ట కండరాలు, తొడలు, చేతులు, ఇంకా శరీరంలోని ఇతర కండరాల గురించి ఉంటుంది. టోనింగ్ చేసేవాళ్లకి కార్డియో వర్కవుట్, మొత్తం శరీర కండరాలను దారిలోకి తెస్తుంది జుంబా.

కార్డియో వర్కవుట్, ఇంకా స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ అందచేస్తుంది జుంబా టోనింగ్. ఆక్వా జుంబా క్లాసులైతే స్విమ్మింగ్ పూల్‌లో జరుగుతాయి. నేర్పించే ఇన్‌స్ట్రక్టర్ పూల్ పక్కన ఉంటాడు. డాన్స్ చేసేవాళ్లు నీళ్లల్లో ఉంటారు. మామూలు జుంబా క్లాసులో చేసే కదలికలే మరింత ప్రత్యేకంగా డిజైన్ చేసి నీటిలో కూడా చేస్తారు. ఈ క్లాసులన్నీ దాదాపు 30 నిమిషాలపాటు నడుస్తాయి. 4 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లల కోసం జుంబా కిడ్స్, జుంబా కిడ్స్ జూనియర్ క్లాసులు ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. జుంబా గోల్డ్ టోనింగ్ క్లాసులు వయసులో చాలా పెద్దవారి కోసం డిజైన్ చేశారు. శరీర బరువు తగ్గడానికి, కండరాలు బలోపేతం చేసుకోడానికి జుంబా సెంటాంవొ, ఒక చెయిర్ వర్కవుట్. దాన్ని కేవలం బాడీ టోన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. జుంబా ఇన్‌స్ట్రక్టర్లు, జుంబా ఇన్‌స్ట్రక్టర్ నెట్‌వర్క్ మెంబర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్లందరికీ రెండు నెలలకొకసారి ఎప్పటికప్పుడు కొత్త తరహా మ్యూజిక్, కొరియోగ్రఫీతో శిక్షణ డివిడిలు పంపించి వారు మరింత మెరుగ్గా జుంబా క్లాసులు చెప్పేలా శద్ధ తీసుకుంటారు. 2010 లో జుంబా మొదటి ఫిట్‌నెస్ విడియో గేమ్ విడుదల చేశారు. 2011 లో అది 30 లక్షల కాపీలు అమ్ముడు పోయింది.

జుంబాతో అద్భుతాలు జరుగుతాయి: నాపేరు అభిలాష. నాకు 23 ఏళ్లు. హెచ్‌ఆర్‌లో ఎమ్‌బిఎ చేశాను. ఎనిమిదినెలలు హెచ్‌ఆర్‌గా పనిచేశాను. నాకు ఆరోగ్యం దెబ్బతినడంతో కుదుటపడ్డాక వెళ్దామని ఉద్యోగం మానేశాను. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్సింగ్ అంటే ఇష్టంగా ఉండేది. ఆరేడేళ్లు క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నాను. కాని నా ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. తర్వాత నేను జుంబా క్లాసులో చేరాను. జుంబాలో చేరాక చాలా సంతోషంగా అనిపించడం మొదలైంది. నా ఆరోగ్యం రోజురోజుకి మెరుగవసాగింది. నేనే జుంబా ఇన్‌స్ట్రక్టర్ ఎందుకవకూడదు అనిపించింది. ఒక జుంబా ట్రెయినర్ వర్క్‌షాప్ నిర్వహిస్తుంటే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు దాదాపు ఏడు నెలలుగా నేను జుంబా నేర్పిస్తున్నాను.

ఇది ఒక వ్యాయామం. కాని చేసేవాళ్లకి అలా అనిపించదు. సాల్సా, రాంబో, హిప్‌హాప్, మెరెంగే అన్నిటికి బేసిక్స్ తీసుకుని జుంబా ఫిట్‌నెస్ డాన్స్ తయారు చేస్తారు. అసలు కష్టపడ్డ భావనే రాదు. నేను డాన్స్ నేర్చుకున్నాను కాబట్టి నాకు జుంబా కొద్దిగా సులువయింది. కాని జుంబా నేర్చుకోడానికి వెళ్లిన సాధారణ విద్యార్థిగా చూస్తే అసలు కష్టం కాదు. జుంబా అన్ని వయసుల వారికోసం. 60ఏళ్ల వయసు వరకు చేయచ్చు. మేం ఏదీ పనిగట్టుకుని నేర్పించం. మేం చేస్తూ వెళ్తాం. మమ్మల్ని చూసి వాళ్లు చేయడమే. అంత సులువు. జుంబా కోసం లాటిన్ మ్యూజిక్ ఉంటుంది. అందులో పై స్థాయి, కింది స్థాయి రెండూ మార్చి మార్చి ఉంటాయి. హై,లో అనే రెండు స్థాయిలు ఉంటాయి. కాబట్టి గుండె కొట్టుకోవడం కూడా దాని ప్రకారం సమతూకంగా సాగుతుంది. మేం ఒక గంట క్లాసుకి 400,500 కేలరీలు కరిగుతాయని చెబుతాం. కొంతమంది వారానికి మూడు రోజులు, మరికొంతమంది వారానికి ఐదు రోజులు చేయడాన్ని ఇష్టపడతారు. రోజుకి 400 కేలరీలు ఖర్చయితే ఒక వారానికి ఎన్ని కేలరీలో ఊహించండి. జుంబాను, జిమ్‌లలో, ఫిట్‌నెస్ సెంటర్‌లలో నేర్పిస్తారు. మా అమ్మ ఫిట్‌నెస్ సెంటర్ ఉంది. నేను అందులో నేర్పిస్తాను.

ఈమధ్య కార్పొరేట్‌లు కూడా వాళ్ల ఆఫీసుల్లో జుంబా ఇన్‌స్ట్రక్టర్లతో క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం శరీరానికి వ్యాయామం జరుగుతుంది. శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. అలసట తెలీదు. అందుకే చాలామంది ఇష్టపడతారు. వయసు ప్రకారం రకరకాల జుంబా డాన్స్ వ్యాయామాలు సూచిస్తాం. చిన్నపిల్లలైతే ఏదైనా చేసేస్తారు. పెద్దవారికి శరీరం మూవ్‌మెంట్ కొద్దిగా తక్కువ ఉండేలాగా చూస్తాం. కాని రోజూ సాధన జరుగుతూ ఉంటే వాళ్లకి శరీరం తేలిగ్గా వంగటం సాధ్యం అవుతుంది. సరైన షూస్, సరైన ఫ్లోర్, సరైన ఇన్‌స్ట్రక్టర్ ఉండటం కూడా చాలా అవసరం. అప్పుడు శారీరకంగా నొప్పులు ఉండవు. సరైన షూస్ వేసుకోవడం మాత్రం జుంబాకు చాలా అవసరం. మనదేశంలో చాలా ప్రదేశాల్లో జుంబా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శిక్షణనిచ్చేవారు మనదేశంలో ఒకరు లేదా ఇద్దరే ఉన్నారంతే. హైదరాబాద్‌లో కూడా ప్రతి ఏడాది రెండు మూడుసార్లు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శ్వేతా పాల్ మన దేశం మొత్తంలో చాలాచోట్ల జుంబా ట్రెయినింగ్స్ నిర్వహిస్తుంటుంది.

జుంబా. కామ్ అనే వెబ్‌సైట్‌కి వెళ్లి మీ దగ్గరలో ఉన్న జుంబా సెంటర్ కనుక్కోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ ట్రెయినింగ్, సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. జుంబా డాట్ కామ్ అనే కంపెనీలో మేం మెంబర్స్‌గా ఉంటాం. ఎప్పుడైతే మేం మెంబర్లవుతామో మమ్మల్ని జింక్ అంటారు. అది జుంబా నెట్‌వర్క్. ఆ కంపెనీ మా ఇన్‌స్ట్రక్టర్లకు రకరకాల కొరియోగ్రాఫ్‌లు పంపుతుంది. రకరకాల ఫిట్‌నెస్ టెక్నిక్‌లను ప్రతి నెలా పంపిస్తుంది. దాని వలన ఎప్పటికప్పుడు శిక్షణ ఆధునికం అవుతుండాలి. అప్పుడే మెరుగైన జుంబాను మా క్లైంట్స్‌కి ఇవ్వగలుగుతాం. ఆ కంపెనీ తరపున సర్టిఫికేషన్ తీసుకోకపోతే వారి సొంతంగా జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా ఎవరూ పనిచేయకూడదు. ఆల్బెర్టో బెటో జుంబా ఫౌండర్. అతని కంపెనీ నుంచి కొత్త పాటలు, కొత్త కొరియోగ్రఫీ, కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉంటాం . ఇది ఎప్పడూ జరుగుతూనే ఉంటుంది. నేర్పించడానికి రోజుకి రెండు గంటలు నేర్పిస్తాను. కాబట్టి నా శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఫిట్‌నెస్ కొరియోగ్రఫీ రోజూ ఎంత చేస్తే బాడీ టోనింగ్ అవుతుంది. క్యాలరీలు బర్న్ అవుతాయి. ఒకరోజు క్లాసుకి వచ్చినవాళ్లు మళ్లీ తిరిగి తర్వాత రోజు రాకుండా ఉండలేరు.

-శ్రీదేవి