హైదరాబాద్: సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ (Bandi sanjay) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సిట్ అధికారుల మీద తనకు నమ్మకం లేదని అన్నారు. ఫోన్ ట్యాఫింగ్ కేసులో సిట్ విచారణకు బండి సంజయ్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ విచారణలో సమర్పించారు. మార్గమధ్యలో ఖైరతాబాద్ హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్లు, విచారణ పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మాజీ సిఎం కెసిఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకు అప్పగిస్తే మొత్తం బయటపెడతామని సూచించారు. విచారణకు రావాలని గత నెల తనకు సిట్ నోటీసులు (SIT NOTICES) ఇచ్చిందని, పార్లమెంటు సమావేశాల దృష్ట్యా విచారణకు రాలేకపోతున్నట్లు చెప్పానని అన్నారు. ఇవాళ సిట్ విచారణకు హాజరై అడిగిన వివరాలు ఇచ్చానని, తన వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలు సిట్ కు అందజేశానని తెలియజేశారు. కేంద్రమంత్రిగా, బాధ్యత గల పౌరుడిగా ఆధారాలు సమర్పించానని, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ను మొదట బయటపెట్టిందే తాను అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కు మొదటి బాధితుడిని తానే అని అన్నారు. తన కుటుంబ సభ్యులందరిపై ఫోన్లపై నిఘా పెట్టారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.