ఇసుక కోసం వెళ్లి మానేరు నది నీటి ప్రవాహంలో చిక్కుకున్న 10 మందిని స్థానికులు తాళ్ల సహాయంతో రక్షించారు. అయితే, వారు తీసుకెళ్లిన ఆరు ట్రాక్టర్లు మాత్రం గల్లంతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మానేరు ఇసుక కోసం యధావిధిగా రోజూ వెళ్లే పద్ధతిలోనే గట్టేపల్లి గ్రామానికి చెందిన ఐదు ట్రాక్టర్లతో మంగళవారం ఉదయమే వెళ్లారు. ఎల్‌ఎండి మానేరు డ్యాం డ్యాంకు నీటి ప్రవాహం అధికం కావడంతో షట్టర్ల ద్వారా నీటిని మానేరులోకి సంబంధిత అధికారుల పర్యవేక్షణలో నీటిని వదిలారు. ఈ విషయాన్ని సుల్తానాబాద్ పోలీసులు ఒకరోజు ముందుగానే ఆయా గ్రామాల్లో ఉన్న ఇసుక ట్రాక్టర్ల యజమానుల వాట్సాప్ గ్రూపులో తెలియజేశారు. ఎల్‌ఎండి నీటిని వదిలారని కనుక ఇసుక కోసం మానేరు వాగుకు వెళ్ళవద్దని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
అయితే, పోలీస్‌ల హెచ్చరికలను పట్టించుకోకుండా మానేరు వాగు ఇసుక కోసం వెళ్లిన ఐదు ట్రాక్టర్లతో పాటు తొమ్మిది మంది ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారు. నీటి ప్రభావం ఒక్కసారిగా అధికమై చెక్ డాం నీటితో నిండి ఓవర్ ఫుల్ తో అతివేగంగా నీటి ప్రవాహం ప్రవహించటంతో మానేరు ఒడ్డున ఉన్న మరో ట్రాక్టర్ డ్రైవర్ గోస్కుల అజయ్‌తో సహా వారిని రక్షించేందుకు మానేరు నీటిలోకి ట్రాక్టర్‌తో వెళ్లి తాను కూడా నీటి ప్రవాహంలో చిక్కుకున్నాడు. దీంతో నీటి ప్రవాహంలో చిక్కుకున్నవారు పదిమందికి చేరింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిలో నల్లవెల్లి నాగరాజు, నల్లవెల్లి మహేష్ , ఏనంక వెంకటేష్, ఏనంక ప్రశాంత్, ఏనంక క్రాంతి, పడాల తిరుపతి, పడాల రమ్య, గుర్రం రాజేష్, గుర్రం రవితోపాటు కదంబపూర్ గ్రామానికి చెందిన మరో యువకుడు గోస్కుల అజయ్. ఉన్నారు. సుమారు 500 మీటర్ల దూరంలో నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. మానేరులో చిక్కుకున్న పదిమంది ఒకరినొకరు పట్టుకొని కొంతదూరం ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నం చేశారు.
అయితే, నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో వారికి ఇబ్బందికరంగా తయారైంది. నీటి ప్రవాహంలో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లతో పాటు పదిమంది చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఎంతో సాహసంతో తాళ్ల సహాయంతో వారిని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. అయితే, ఆరు ట్రాక్టర్లు మాత్రం నీటి ప్రవాహంలో కొటుకుపోయాయి. సంఘటన స్థలానికి సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్ కుమార్ చేరుకొని పరిస్థితిని పరిశీలించి మానేరులోకి వెళ్ళవద్దని హెచ్చరించినప్పటికీ ఎందుకు వెళ్తున్నారని మందలించారు. ఇకపై నీటి ప్రవాహం తగ్గేవరకు మానేరులోకి ఎవరూ వెళ్ళవద్దని హెచ్చరిస్తూ వాగు వద్ద పోలీస్ పహరా ఏర్పాటు చేశారు.
Also Read: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం : మంత్రులు సీతక్క, సురేఖ