ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 10 మంది స్మగ్లర్లు ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి గురువారం తీర్పు నిచ్చారు. ఆర్‌ఎస్‌ఎఎస్టీఎఫ్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 59/2019 కేసులో 10 మంది ముద్దాయిలు అరెస్టయ్యారు. వీరు తమిళనాడు లోని తిరువన్నామలై, వేలూరు జిల్లాలకు చెందిన 1. సి. విశ్వనాథన్, 2. డి సేతు, 3. డి. రమేష్, 4. ఎం. సంపత్, 5. వి.రత్నం, 6. ఎం. బూఛాయాన్, 7. జె. కుమార్, 8. సి. ప్రభు 9. ఎం. సురేష్, 10.. సి.రామర్ కాగా,
వీరు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పెరుమాల్లపల్లి బీటు, టీఏన్ పాలెం సెక్షన్ ఎస్వీఎన్పీ డివిజన్ లో పట్టుబడ్డారు. వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి 10 మంది స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టుకు హాజరు కాని ప్రభు అనే ముద్దాయికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు 9 మందిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడమే కాకుండా, అడవిలోకి అక్రమ ప్రవేశం చేసిన నేరస్తులకు కూడా ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని అభినందించారు.