Monday, May 12, 2025

ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గజగజ

- Advertisement -
- Advertisement -

దాయాదికి గట్టి గుణపాఠం చెప్పాం ఉగ్రవాదం అంతమే ఆపరేషన్
లక్షం ముష్కరుల శిబిరాలను గురిచూసి కొట్టాం, దాడుల్లో 100 మంది
హతం పౌరులే లక్షంగా పాక్ ప్రతిదాడులు డ్రోన్లు, మానవరహిత
విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టాం పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక
స్థావరాలు తుత్తునియలు భారత్ దాడుల్లో 40 మంది పాక్ సైనికులు
మృతి మళ్లీ దాడులు చేస్తే తీవ్రమైన ప్రతిచర్యలు మీడియా సమావేశంలో
త్రివిధ దళాల ఉన్నతాధికారుల స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అంతం చేయడమే ‘ఆపరేషన్ సిందూర్’లక్షమని భారత సైన్యం స్పష్టం చేసింది. తాము చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. దాడుల భయంతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలు ఖాళీ అవుతున్నాయనిపేర్కొంది. పహల్గాంలో 26మంది అమాయకులను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారని భారత సైన్యం వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి త్రివిధ దళాలకు చెందిన అధికారులు ఆదివారం మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్( పిఒకె)లో 5,పాక్‌లో 4 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసినట్లు వారు తెలిపారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు దీటుగా సమాధానమివ్వాలని నిర్ణయించాం. ఉగ్రవాదులకు సరయిన సమాధానమివ్వాలన్నదే ఆపరేషన్ సిందూర్ లక్షం. సరిహద్దుకు అవతల ఉన్న ఉగ్రశిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించాం. స్పష్టమైన ఆధారాలతో 9 ఉగ్ర శిబిరాలపై దాడి చేశాం.ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులతో పాకిస్థాన్ గజగజలాడిపోయింది. ఆ తర్వాత మన పౌరులే లక్షంగా దాడులకు దిగింది. అనంతరం దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకుంది. భారత్ చేపట్టిన‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఉగ్రవాదుల శిబిరాలపై జరిపినదాడుల్లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసి 814 హైజాకర్లు, పుల్వామా దాడుల్లో పాల్గొన్న ముష్కరులు పలువురు హతమయ్యారు. వారిలో యూసఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ తదితరులు ఉన్నారు’ అని ఆర్మీ డిజిఎంఓ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.

40 మంది పాక్ సైనికులు మృతి!
ఈ నెల 8, 9 తేదీ రాత్రి భారత్‌పై గగనతల దాడికి పాకిస్థాన్ ప్రయత్నించింది. డ్రోన్లు, మానవ రహిత విమానాలు మనవైపు దూసుకువచ్చాయి. వాటినన్నిటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పౌరులపై దాడులను అడ్డుకున్నాం. డ్రోన్ దాడులకు ప్రతిగా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై దాడులు చేశాం. మొత్తంగా మూడు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో 35నుంచి 40 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నాం’ అని డిజిఎంఒ పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి పాక్ వైమానిక స్థావరాలు, ఇతర కీలక స్థావరాలపై దాడులు చేసిన తర్వాత వైమానిక దళానికి చెందిన పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని ఆర్మీ అధికారులు చెప్పారు.

తాము రెండు భారతీయ యుద్ధ విమానాలను కూల్చి వేశామని పాక్ చెప్పుకోవడం గురించి అడగ్గా ఇప్పటికీ యుద్ధ పరిస్థితి ఉందంటూ దానికి సమాధానం ఇవ్వడానికి ఎయయిర్‌మార్షల్ ఎకె భారతి నిరాకరించారు. భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాక్‌కు సైన్యం స్పష్టమైన సందేశం ఇచ్చింది. పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియజేశాం.సైన్యం, వాయుసేన చర్యలకు అనుబంధంగా అరేబియాసముద్రంలో నౌకాదళం సర్వ సన్నద్ధంగా ఉంది. కశ్మీర్‌నుంచి గుజరాత్ వరకు సరిహద్దు నగరాలపై డ్రోన్ దాడులకు పాక్ ప్రయత్నించింది. గుంపులు, గుంపులుగా డ్రోన్లతో దాడులకు యత్నించిందని త్రివిధ దళ అధికారులు వెల్లడించారు.

మళ్లీ దాడులు చేస్తే..
పాక్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పాక్ ప్రతిపాదన మేరకు కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చాం. అయినా కొన్ని గంటల్లోనే మళ్లీ డ్రోన్ దాడులు కొనసాగించింది. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయి. ఉల్లంఘనలపై దీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి సైనికాధికారులకు సైన్యాధ్యక్షుడు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చారని డిజిఎంఒ స్పష్టం చేశారు.
ఐదుగురు భారత జవాన్లు మృతి
కాగా, పాక్‌తో జరిగిన ఘర్షల్లో అయిదుగురు భారత జవాన్లు ్ల మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే పాకిస్థాన్ చాలా మందినే కోల్పోయిందని కూడా వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News