Monday, May 19, 2025

ఇజ్రాయెల్ దాడిలో 103 మంది బలి

- Advertisement -
- Advertisement -

దీర్ఘకాలిక దాడుల పీడిత గాజా స్ట్రిప్ మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులతో తల్లడిల్లింది. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సేనలు తమ సుదీర్ఘకాలపు టార్గెట్ ఖాన్‌యూనిస్‌పై జరిపిన దాడులలో కనీసం 103 మంది వరకూ దుర్మరణం చెందారు.పలు ఆసుపత్రులకు క్షతగాత్రులు రావడం, చికిత్స పొందుతూ వీరిలో కొందరు మృతి చెందడం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. దాడుల క్రమంలో తమ టార్గెట్లు ఏమిటనేది కూడా గుర్తించనంత విచక్షణారహితంగా ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో వరుసగా వైమానిక ఇతరత్రా దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో సాధారణ పౌరులు బాధితులు అవుతున్నారు. ప్రత్యేకించి ఉత్తర గాజాలో ఆదివారం పలు ప్రాంతాలు గాయాలతో తల్లడిల్లుతూ , సరైన చికిత్స లేకుండా రోదిస్తూ ఉన్న పౌరులు, అనేక ప్రాంతాలలో భౌతిక కాయాలు దిక్కులేకుండా పడి ఉన్నాయి.

దీనితో ఈ అమానుష యుద్ధ పరిస్థితి నుంచి తమకు విముక్తి ఎప్పుడని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తెల్లవారుజామునే జబాలియా శరణార్థ శిబిరంపై దాడుల తరువాత భయానక పరిస్థితి ఏర్పడింది. అనేక మంది దాడులలో మృతి చెందారు. ఆకలి దప్పులు తీర్చుకోవడానికి, తలదాచుకోవడానికి ఇక్కడికి వస్తే తమకు ఇక్కడ కూడా దిక్కులేని స్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. తమతో పాటు తలదాచుకున్న వారి తలలు తెగిపడ్డాయి. మా కాళ్లు చేతులు విరిగి పడ్డామని ఓ ముసలి వ్యక్తి తెలిపారు. ఇప్పట్లో తమ బాధల నుంచి ఎప్పటికైనా విముక్తి దక్కుతుందా ? అనేది తమను కలిచివేస్తున్న ప్రశ్న అని చెప్పారు. తమకు బతుకు అనేది తాత్కాలికం అయ్యి, చావు ఎప్పుడు అయినా తరుముకుని వచ్చి , కబళించుకు వెళ్లే తంతు అయిందని తన పిల్లలు మృతి చెందగా బాధను దిగమింగుతూ ఓ నడివయస్సు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ప్రాంతంలో ఇప్పటికీ తలదాచుకుంటూ వస్తున్న హమాస్ తీవ్రవాదుల పూర్తి ఏరివేత తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ స్పందించింది. ఈ దాడులలో పౌరుల మృతి గురించి స్పందించలేదు. కాగా ఇజ్రాయెల్ ఇప్పుడు తమ ఆయుధ పొదిలోని అత్యంత శక్తివంతమైన సరికొత్త గిడియన్స్ ఛారియట్స్‌ను దాడికి వాడిందని వెల్లడైంది. ఈ ప్రత్యేక ఆయుధ వ్యవస్థ లక్షణాలు ఇతరత్రా వివరాలను ఇజ్రాయోలీలు వెల్లడించలేదు. ఇక ముందు తెలిసివస్తుందని ఓ సైనికాధికారి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News