ఎయిరిండియా పైలట్లు ఇటీవలి కాలంలో క్రమేపీ ఎక్కువగా సెలవులు తీసుకుంటున్నారు. గత నెలలో అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరగడం , ఇందులో 260 మంది సజీవ దహనం చెందడం భారతీయ విమాన చరిత్రలో ఘోర ప్రమాదంగా నమోదు అయింది. ఈ ఘటన తరువాత పైలట్లు సిక్ లీవ్ తీసుకుంటూ విధులకు దూరంగా ఉండటం జరుగుతోంది. ఇటువంటి ఉదంతాలలో పెరుగుదల ఉందని కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ గురువారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జూన్ 16 తేదీన ఒక్కరోజే మొత్తం 112 మంది పైలట్లు అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు.
వీరితో 51 మంది కమాండర్లు (పి1) , 61 మంది ఫస్ట్ ఆఫీసర్లు (పి2)స్థాయి వారు ఉన్నారని మంత్రి తమ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. తీవ్రస్థాయి విషాదకర ఘటన తరువాత పైలట్లు మానసిక ఆందోళనకు గురి అయ్యారు. వెంట వెంటనే విధులకు హాజరు కాలేని స్థితిలో పడ్డారు. పైలట్ల మానసిక ఆందోళన తరువాత తలెత్తే నిస్సత్తువ , నిర్తిప్తత వంటి సమస్యల పరిష్కారానికి విమానయాన సంస్థ నిర్వాహకులు పైలట్లకు సరైన ఉపశమన చికిత్స లేదా తగు సలహాలు ఇవ్వాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఎ) మెడికల్ సర్కులర్ వెలువరించింది. ఈ మేరకు పైలట్లకు తగు మానసిక స్వాంతన చర్యలు తీసుకుంటున్నారని కూడా ప్రకటనలో తెలిపారు.