ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో బుధవారం మొత్తం 12 మంది నక్సలైట్లు అధికారుల ఎదుట లొంగిపొయ్యారు. వీరిలో తొమ్మండుగురిపై కలిపి రూ 28.50 లక్షల నజరానా ప్రకటితం అయి ఉంది. నక్సల్స్ ప్రాబల్య ఈ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన లాన్ వర్రట్టు అంటే మీ గ్రామానికి, మీ ఇళ్లకు మీరు చేరండి అనే చైతన్య ఉద్యమంలో భాగంగా వీరు సరెండర్ అయ్యారు. వీరి సరెండర్ విషయాన్ని దంతేవాడ ఎస్‌పి గౌరవ్ రాయ్ విలేకరులకు తెలిపారు. 2020 జూన్‌లో తలపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 1005 మంది నక్సల్స్ సరెండర్ అయ్యారు. వీరిలో 249 మందిపై రివార్డులు ఉన్నాయి. క్రమేపీ నక్సలైట్లు తమ పంథా వీడి జనం బాట పట్టడం సంతోషకర పరిణామం అని ఎస్‌పి తెలిపారు. సరెండర్ అయిన వారి సంఖ్య ఇప్పుడు వేయి దాటడటం ప్రభుత్వం చేపట్టిన దూరదృష్టితో కూడిన కార్యాచరణ పథకాల ఫలితం అని వివరించారు.భద్రతా బలగాల నిరంతర చర్య, స్థానిక తెగల సహకారంతోనే ఇప్పటి పరిణామం సాధ్యం అయిందని తెలిపారు.
ఇంతకాలం యువత మావోయిస్టు శుష్క సిద్ధాంతాలకు లొంగిపోయి అడవిదారిపట్టింది. ఇప్పుడు వీరు తిరిగి జనజీవన స్రవంతి లోకి రావడం, తమ ఇళ్లకు, తమ బతుకు పంథాకు చేరడం కీలక పరిణామం అని హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ పోలీసు అధికారులు, సిపిఆర్‌ఎఫ్ వర్గాల ఎదుట ఇద్దరు మహిళలు సహా 12 మంది సరెండర్ అయినట్లు చెప్పారు. దట్టమైన అడవులు, మావోయిస్టు నాయకత్వంలో చెలరేగుతున్న విభేదాల క్రమంలో నక్సల్స్ లొంగుబాటు , ప్రత్యేకించి యువతరం ఎక్కువగా లొంగిపోతోందని తెలిపారు. పైగా ప్రభుత్వం చేపడుతున్న పలు పునరావాస పథకాలు , ఊళ్లకు తరలండి కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అయ్యి ఈ లొంగుబాటలు సాగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు సరెండర్ అయిన వారిలో బుర్సు పుణేం (52), అమిత్ అలియాస్ హింగా బర్సా కూడా ఉన్నారు. వీరు గడ్చిరోలి డివిజన్ మావోయిస్టుల ఒకే దళంలో వీరు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వీరిని పట్టిస్తే రూ 8 లక్షలు చొప్పున ఇస్తామని అధికారులు ప్రకటించారు.