పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. వరుస ఆపరేషన్లలో ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి. ఆ దాడి జరిగి100 రోజులు కాగా, ఇప్పటివరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. వారిలో ఆరుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నారని, సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ఆరుగురికి కూడా జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉందని పేర్కొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దానికి ప్రతీకారంగా మే7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి భారత్ బదులిచ్చింది. తరువాత ఉగ్రవాదులను జల్లెడ పట్టేందుకు పలు ఆపరేషన్లు నిర్వహించింది. వాటిలో మహాదేవ్ ఎంతో కీలకమైంది. ఆ ఆపరేషన్‌లో పహల్గా ఘటన బాధ్యులు హతమయ్యారని కేంద్రం ప్రకటించింది.
మరోవైపు శివశక్తి ఆపరేషన్‌లో మరో ఇద్దరు హతమయ్యారు. మే 15న షోపియాన్ లోకి కెల్లర్ అడవుల్లో మరో ముగ్గురు , నాదెర్ ప్రాంతంలో ఇంకో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పహల్గాం కుట్రదారులను, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా నాటి ఊచకోతలో పాల్గొన్న ముష్కరులను హతమార్చామని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాలు, సరిహద్దు నుంచి 100 కిమీ దూరంలో ఉన్న పాక్ లక్షాలపై దాడి చేశాయని చెప్పారు. మనబలగాలు విసిరిన పంజా దెబ్బకు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం సంఘటనకు ముందు పీఓకే లోని 42 లాంచ్ ప్యాడ్లలో 110 నుంచి 130 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లో 70 నుంచి 75 మంది చురుగ్గా ఉన్నారని , జమ్ము, రాజౌరీ, పూంచ్‌ల్లో 60 నుంచి 65 మంది ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్టు పేర్కొన్నాయి.