Saturday, May 24, 2025

అమ్మా..నేను చిప్స్ దొంగిలించలేదు..అవమాన భారంతో బాలుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చేయని తప్పునకు తనను తిట్టారని పన్నెండేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోల్‌కతా లోని పశ్చిమ మేదినీపుర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బజార్ ప్రాంతానికి చెందిన కృష్ణేందు దాస్ (12) చిప్స్ కొనుక్కోడానికి అదే ప్రాంతం లోని శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో దుకాణదారుడు లేకపోవడంతో అతడిని పలుమార్లు పిలిచాడు. అతడు ఎంతకీ స్పందించకపోవడంతో చిప్స్ పాకెట్ తీసుకొని డబ్బు తర్వాత ఇవ్వొచ్చుననుకొని వెళ్లాడు . చిప్స్ పాకెట్ పట్టుకొని వెళ్తుండడం గమనించిన దుకాణదారుడు బాలుడి వెంటపడి పట్టుకున్నాడు. అందరి ముందు చెంపదెబ్బ కొట్టి దుకాణం నుంచి చిప్స్ దొంగిలించాడని అందరికీ చూపిస్తూ రోడ్డు పైనే బాలుడితో గుంజీలు తీయించాడు. తాను మళ్లీ డబ్బులు ఇద్దామని అనుకొనే పాకెట్ తీసుకున్నానని చెప్పినప్పటికీ వినకుండా బాలుడి తల్లిని కూడా రోడ్డు పైకి పిలిపించి జరిగిన విషయం చెప్పాడు.

దీంతో కోపంతో ఆమె కూడా బాలుడిని చెంపదెబ్బ కొట్టింది. తల్లితోపాటు ఇంటికి తిరిగొచ్చిన బాలుడు మరో గది లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా బాలుడు తలుపు తీయక పోవడంతో అతడి తల్లి, పక్కింటి వారి సహాయంతో తలుపు పగులగొట్టి చూడగా, అప్పటికే అతడు స్పృహ తప్పి పడి ఉన్నాడని, నోటి నుంచి నురగ కారుతుండడంతో ఆస్పత్రికి తరలించారని పోలీసులు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి రూమ్‌లో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కానీ ఆ సూసైడ్ నోట్‌లో బాలుడు చెప్పింది మరో విధంగా ఉంది. తాను షాప్‌లో దొంగతనం చేయలేదని, షాప్ అంకుల్ లేకపోవడంతో తిరిగి వస్తుండగా, రోడ్డు పక్కన పడున్న లేస్ పాక్‌ట్ కనిపించిందని రాశాడు. తనకు కుర్‌కురే అంటే చాలా ఇష్టం కాబట్ఠి అది తీసుకున్నానని, దుకాణదారుడు దానిని తన షాప్ లోని పాకెట్ అనుకున్నాడని లెటర్‌లో పేర్కొన్నాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని దుకాణదారుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News