ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చొరవతో సుధీర్ఘకాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగసంఘాలు తిరిగి ప్రభుత్వ గుర్తింపునకు నోచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగసంఘాలకు గుర్తింపు ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు(జివో నెం.185) జారీచేసింది. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. వెంటనే సాధారణ పరిపాలన శాఖ(జిఎడి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా కు చీఫ్ సెక్రెటరీ వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించారు. బుధవారం మధ్యాహ్నం పర్మనెంట్ మెంబర్స్‌గా తొమ్మిది ఉద్యోగ సంఘాలు, రోటేషన్ ప్రాతిపదికన ఆరు ఉద్యోగ సంఘాలుల మొత్తం 15 ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పర్మనెంట్ మెంబర్స్‌గా తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్(టిఎన్జీవో సెంట్రల్ యూనియన్),
తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సెంట్రల్ అసోసియేషన్), డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రెటేరియేట్ అసోసియేషన్(టిజిఎస్‌ఎ), ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టిచర్స్ యూనియన్(పిఆర్‌టియు టిఎస్), స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(ఎస్టీయూ టిఎస్), తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్(ట్రెసా), తెలంగాణ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(టిఎస్ యూటిఎఫ్), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టిఆర్‌టిఎఫ్) ఉన్నాయి. రోటేషన్ ప్రాతిపదికన ఆరు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో తెలంగాణ సెక్రెటేరియేట్ ఆఫీసర్స్ అసోసియేషన్(టిజిఎస్‌ఓఎ), డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టిజిటిఎ), తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టిపియుఎస్), స్కూల్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్టీఎఫ్), గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఉన్నాయి. ఉద్యోగసంఘాల గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగసంఘాల జేఎసి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.
పదేళ్ల తర్వాత మళ్లీ గుర్తింపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలతో దశాబ్దాలుగా గుర్తింపును పొందిన ఉద్యోగ సంఘాలను 2014 వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉద్యోగసంఘాల గుర్తింపును రద్దు చేశారు. ప్రజల ఆధరణతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం తిరిగి ఉద్యోగ సంఘాలకు గుర్తింపును ఇవ్వడం పట్ల ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క, మంత్రివర్గ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.