ఒడిశాలోని పూరీ జిల్లాలో శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ 15 ఏళ్ల బాలికకు నిప్పంటించారని అధికారులు తెలిపారు. ఆ అమ్మాయిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు 70 శాతం మేరకు కాలిన గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆమె మాట్లాడగలుగుతోందని సమాచారం. మహిళా శిశు అభివృద్ధి శాఖ ఇన్‌ఛార్జీ అయిన ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిద ఆ బాలికకు అయ్యే మొత్తం చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, అపరాధులను వీలయినంత త్వరగా అరెస్టు చేయమని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ముగ్గురు మోటారు సైకిల్‌పై వచ్చిన యువకులు దారిలో ఆ అమ్మాయిని అడ్డగించి, భార్గవి నది ఒడ్డు వద్దకు బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై అంటుకునే ద్రవాన్ని పోసి నిప్పంటించారని పోలీస్ అధికారి తెలిపారు.
ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళుతున్నప్పుడు ఉదయం 9 గంటలకు బలంగా పోలీస్ స్టేషన్ పరిధిలో బయాబర్ గ్రామంలో ఈ ఘాతుకం జరిగింది. ఈ దుర్ఘటన బలంగ పోలీస్ స్టేషన్ పరిధిలోని బయాబర్ గ్రామం వద్ద జరిగింది. అది కూడా నౌగోపాల్‌పూర్ బస్తీలోని ఆమె ఇంటికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో.ఆమెకు నిప్పంటించిన దుండగులు తరువాత పారిపోయారు. అయితే స్థానికులు మంటలు ఆర్పి, ఆమెను పిపిలీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలెట్టామని పూరీ పోలీస్ సూపరింటెండెంట్ పినాక్ మిశ్రా తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు రెండు పోలీస్ బృందాలను ఏర్పాటుచేశారు. బిజెడి, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధుల బృందం ఎయిమ్స్‌కు వెళ్లి ఆ బాలిక కుటుంబ సభ్యలను పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శ్రీకాంత్ జెనా అన్నారు.