అమృత్‌సర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం (adulterated alcohol ) తాగి 17 మంది మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం అమృత్‌సర్ జిల్లాలోని మజితా బ్లాక్‌లోని భంగాలీ కలాన్, పాటల్‌పురి, థారీవాల్, సంఘ, మరారి కలన్ గ్రామాలకు చెందిన కొంతమంది ప్రజలు కల్తీ మద్యం (adulterated alcohol) తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వారిని దగ్గరలోని అమృత్‌సర్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ 17 మంది చనిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి శాన్వే ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మజితా బ్లాక్‌లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుందన్నారు. ఆదివారంనాడు రాత్రి తమకు సమాచరం వచ్చిందని, ద్యం తాగి 5 గ్రామాలకు చెందిన ప్రజలు అస్వస్థతకు గురైనట్లు తెలిసిందన్నారు. వెంటనే వైద్య బృందాలను గ్రామాలకు పంపి, చికిత్సకు ఉపక్రమించామన్నారు. మెడికల్ టీమ్స్ బాధిత గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆరోగ్యం గురించి విచారిస్తున్నాయని తెలిపారు. అనారోగ్య లక్షణాలు ఉన్నా లేకపోయినా.. మద్యం తాగిన వారిని ఆస్పత్రికి తీసుకెళుతున్నట్లు వివరించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోందన్నారు.
పరిస్థతి విషమంగా ఉన్న ఆరుగురిని రక్షించడానికి డాక్టర్లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. మద్యం తాగి 17 మంది చనిపోయిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు. అమాయకుల ప్రాణాలను బలిపెట్టిన వారిని చట్ట పరిధిలో కఠినంగా శిక్షిస్తామని ఆయన ‘ఎక్స్’ ద్వారా స్పష్టం చేశారు. మరోవైపు కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. లిక్కర్ మాఫియాను నియంత్రించడంలో మాన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించాయి. కల్తీ మద్యం తయారీదారులు భారీ ఎత్తున మిథనాల్ ఆర్డర్ చేసినట్లు విచారణ తేలిందని పోలీసులు వెల్లడించారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.