మెదక్ జిల్లా, శివ్వంపేట మండలంలో విద్యుదాఘాతంతో పశువుల పాక దగ్ధమైన ఘటనలో 2 పాడి గేదెలు, 5 లేగదూడలు మృతి చెందాయి. బాధితుల కథనం ప్రకారం..భోజ్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్యా తండాలో బుధవారం తెల్లవారుజామున బానోత్ లక్ష్మణ్ పశువుల పాక విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఆ సమయంలో పశువుల పాకలో ఉన్న రెండు పాడి గేదెలు, ఐదు లేగదూడలు, 600 గడ్డి మోపులు దగ్ధమయ్యాయి. రోజూ మాదిరిగానే పశువుల షెడ్డులో పశువులను తోలి బానోతు లక్ష్మణ్ ఇంటికి వెళ్ళాడు. తెల్లవారుజామున మంటలు ఎగిసి పడడంతో చూసిన పలువురు రైతులు వెంటనే లక్ష్మణ్‌కు సమాచారం అందించి, ఫైర్ ఇంజన్‌కు కాల్ చేశారు.
అయితే, పశువుల షెడ్డు వద్దకు వచ్చే రోడ్డుపై బురద ఉండడం వల్ల ఫైర్ ఇంజన్ అందులో దిగబడిపోయి కొద్దిసేపు ఇబ్బంది కావడంతో మంటలు ఆర్పడం కాస్త ఆలస్యమైంది. పశువుల పాకలో ఉన్న గేదెలు మృతి చెందడంతో పశువులను మేపుకుంటూ జీవనం కొనసాగించే రైతు లక్ష్మణ్ అప్పు ఎలా తీర్చాలి.. ఎలా బతకాలని బోరున ఏడుస్తూ స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే అతనిని నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఏడుస్తుండడంతో తండావాసులు కంటతడి పెట్టారు. బానోత్ లక్ష్మణ్ కు 5 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది .బాధిత రైతు కుటుంబాన్నిన ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.ఆర్‌ఐ కిషన్ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పైఅధికారులకు నివేదిక పంపిస్తున్నట్టు తెలిపారు.