Friday, August 29, 2025

మెహిదీపట్నం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

రూ. 398 కోట్లతో రెండు ఫ్లైఓవర్లు
టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసి
నానల్ నగర్ చౌరస్తా మీదుగా ఫస్ట్‌లేవల్ ఫ్లైఓవర్
రేతిబౌలి చౌరస్తా మీదుగా సెకండ్ లేవల్ ఫ్లైఓవర్
మెహిదీపట్నం ప్రాంత ప్రయాణికుల ట్రాఫిక్ చిక్కులకు చెక్
3 నెలల్లో పనులు చేపట్టేందుకు కమిషనర్ కర్ణన్ ప్లాన్

మనతెలంగాణ సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్ర ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న మెహిదీపట్నం, నానల్‌నగర్, రేతిబౌలి, లంగరహౌస్, అత్తాపూర్ ప్రజలకు జీహెచ్‌ఎంసి కమిషనర్ కర్ణన్ గుడ్ న్యూస్ తెలిపారు. ఇక్కడి ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెండు ఫ్లైఓవర్లను నిర్మించేందుకు టెండర్లను పిలిచారు. రేతిబౌలి, నానల్‌నగర్ చౌరస్తాల మీదుగా ఫ్లైఓవర్లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్దంచేశారు. రూ. 398 కోట్ల అంచనా వ్యయంతో ఈ రెండు ఫ్లైఓవర్లను నిర్మించనున్నట్టు టెండర్లలో వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ల పనులు వచ్చే మూడు నెలల్లోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ కర్ణన్ ఆదేశించినట్టు తెలిసింది. ఇక్కడ భూసేకరణకు సంబంధించి రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఆర్‌డిపి)ని కూడా తయారు చేశారు. ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణాలల్లో ప్రభావితమవుతున్న ఆస్తులు, భూముల వివరాలను ఈపాటికే గుర్తించి ప్రభుత్వం దృష్టికి కమిషనర్ కర్ణన్ తీసుకెళ్ళినట్టు తెలిసింది. ఈమేరకు ప్రభుత్వం, ఇటు రక్షణ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. డిఫెన్స్ అధికార యంత్రాంగం నుండి సానుకూల సంకేతాలు వెలువడిన వెంటనే జీహెచ్‌ఎంసి టెండర్లను పిలిచినట్టు అధికార వర్గాల సమాచారం.

రెండు ఫ్లైఓవర్లు..
సెకండ్ లేవల్ ఫ్లైఓవర్ ముందుగా లంగర్‌హౌస్ నానల్ నగర్ చౌరస్తాకు చేరుకునే రోడ్డులో 2 లేన్‌లతో ప్రారంభమై నానల్ నగర్ చౌరస్తాను, రేతిబౌలి చౌరస్తాను ఈ రెండు చౌరస్తాలను దాటిన తర్వాత అత్తాపూర్ రోడ్డులో 2 లేన్‌లుగా ప్రారంభమయ్యే మరొక ఫ్లైఓవర్ రేతిబౌలి చౌరస్తాను దాటుకుంటూ.. లంగర్‌హౌస్ నుండి వచ్చే ఫ్లైఓవర్‌ను కలుస్తుంది. ఈ రెండు ఫ్లైఓవర్లు రెండేసి లేన్‌లుగా ప్రారంభమై.. రెండు కలిసిన అనంతరం మూడు లేన్‌లుగా మారి మెహిదీపట్నం వైపు సాగుతుంది. ఈ మూడు లేన్‌లుగా ప్రారంభమైన ఫ్లైఓవర్ పివిఎక్స్‌ప్రెస్ వే ల్యాడ్ అయ్యే సమీపాన ల్యాండ్ అవుగూ ముగియనున్నది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారు 2 కి.మీ. లుగా ఉంటుందనేది సమాచారం. ఇదిలా ఉండగా సుమారు 1 కి.మీ. పొడవుగా ఉన్న ఫస్ట్ లేవల్ ఫ్లైఓవర్ రేతిబౌలి కూడలి దాటిన వెంటనే ప్రారంభమై.. నానల్‌నగర్ చౌరస్తా దాటిన అనంతరం టోలిచౌక్ ఫ్లైఓవర్‌కు ముందుగా ఈ ఫ్లైఓవర్ ల్యాండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ మీదుగా వచ్చిన వారు నేరుగా టోలి చౌక్ ఫ్లైఓవర్ మీదికి వెళ్ళే సౌలభ్యం ఉంటుంది. లంగర్ హౌస్, అత్తాపూర్‌ల ఫ్లైఓవర్ల మీదుగా వచ్చే వారు నేరుగా నానల్ నగర్, రేతిబౌలి చౌరస్తాలను సౌలభ్యంగా దాటుకుని మెహిదీపట్నం చౌరస్తాలోనూ, బస్‌స్టాండ్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నేరుగా వెళ్ళిపోయే వీలు ఈ రెండు ఫ్లైఓవర్లు కల్పిస్తున్నాయి.

రక్షణ శాఖ స్థల సేకరణకు కసరత్తు
ఈ రెండు ఫ్లైఓవర్‌ల నిర్మాణం సందర్భంగా సుమారు 2 ఎకరాల వరకు రక్షణశాఖకు చెందిన భూములను సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందనేది అధికార వర్గాల సమాచారం. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని కమిషనర్ కర్ణన్, మునిసిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తీలు తీసుకెళ్ళినట్టు తెలిసింది. రక్షణశాఖ అధికారులతో తాను సంప్రదింపుల అంశాన్ని చూస్తానని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతో కమిషనర్ కర్ణన్ ఈ రెండు ఫ్లైఓవర్లకు టెండర్లు పిలిచినట్టు సమాచారం. మెహిదీపట్నంలో ప్రభావితమవుతోన్న రక్షణ శాఖ స్థలాల సేకరణకు బల్దియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు రెండు దఫాలుగా రక్షణ శాఖ, బల్దియా అధికారులు సమావేశమయ్యారు. రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించేందుకు సర్కారు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ రెండు ఫ్లైఓవర్ల పనులు అతి త్వరలోనే మొదలు కానున్నట్టు కమిషనర్ కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News