న్యూఢిల్లీ : జిఎస్‌టి కౌన్సిల్ 56వ సమావేశంలో దేశపు పన్ను వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఈ నెల 22 నుంచి దేశంలో కొత్తగా రెండు రకాల జిఎస్‌టి రేట్లు మాత్రమే అమల్లోకి వస్తాయి. సాధారణ వస్తు, సేవలపై 5 శాతం, 18 శాతం పన్నులు వసూలు అవుతాయి. అయితే ఆరోగ్యానికి హానికరమైనవి లేదా విలాసవంతమైనవిగా భావించే కొన్ని ఉత్పత్తులు, వాటి సేవలపై మాత్రం 40 శాతం జిఎస్‌టి రేటు అమలు చేయనున్నారు. వీటినే సాధారణంగా ‘సిన్ గూడ్స్’ అని పిలుస్తారు. ఆరోగ్యానికి లేదా సమాజానికి ముప్పుగా ఉండే వస్తు, సేవలను ‘సిన్ గూడ్స్’ అంటారు. వీటిలో మద్యం, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, అధిక చక్కెర లేదా కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు, బెట్టింగ్, కాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్ వంటి అంశాలు ఉంటాయి.
సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి వాటిపై అధిక పన్నులు వేసి వినియోగాన్ని తగ్గిస్తుంది, అలాగే అధిక ఆధాయాన్ని కూడా సమకూర్చుకుంటుంది. భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి వస్తువులపై 28 శాతం జిఎస్‌టితో పాటు ప్రత్యేక నష్టపరిహార సుంకం వసూలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సుంకం రద్దు చేసిన నేపథ్యంలో మొత్తం 40 శాతం జిఎస్‌టి విధిస్తున్నారు. కొత్త జిఎస్‌టి 2.0లో 40 శాతం రేటు కేవలం ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులు, సేవలపైనే వర్తిస్తుంది. వీటిలో అన్ని రకాల గ్యాస్‌తో కూడిన సాఫ్ట్‌డ్రింక్స్, కార్బొనేటెడ్ బేవరేజెస్, కెఫీన్ ఉన్న పానీయాలు, హైఎండ్ 350సిసి పైబడి ఉన్న బైకులు, అలాగే యాట్స్, హెలికాప్టర్లు వంటి విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా బెట్టింగ్, జూదం, గుర్రపు పందాలు, కాసినోలు, లాటరీలు, ఆన్‌లైన్ మనీ గేమింగ్ కూడా వీటిలో భాగంగా ఉన్నాయి.
పొగాకు, పాన్ మసాలాపై ఎంత పన్ను?
పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులు ఇప్పటికీ పాత 28 శాతం పన్ను, నష్టపరిహార సెస్ కిందనే కొనసాగుతాయి. దీనికి కారణం ఆ సెస్‌తో సంబంధం ఉన్న అప్పులు, వడ్డీలు ఇంకా తీర్చాల్సి ఉండటమే. ఆ బకాయిలు పూర్తయిన తర్వాతే వీటిని కొత్త 40 శాతం రేటులోకి మార్చుతామని జిఎస్‌టి కౌన్సిల్ స్పష్టం చేసింది.
బీడీ టెండు ఆకులపై ఊరట
ఇక బీడీల తయారీలో ఉపయోగించే టెండు ఆకులపై మాత్రం ఊరట కలిగించారు. ఇప్పటివరకు అధిక పన్ను విధించిన వీటిపై జిఎస్‌టిని 5 శాతానికి తగ్గించారు. ఇది ఇప్పటికే పొగాకు ఆకులపై అమలులో ఉన్న రేటుతో సమానంగా ఉంటుంది. అటవీ ఉత్పత్తుల సేకరణలో పాలుపంచుకునే గిరిజన సమాజాలకు ఇది దోహదం చేయనుంది.