రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టిడిపి నేతలు మృతి చెందారు. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తుండగా స్కార్పియో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన టిడిపి నాయకులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను గుండ్లపాడుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణమైన స్కార్పియో మరో టిడిపి నేత వెంకట్రామయ్యకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
కాగా, గత కొన్ని రోజులుగా స్థానిక టిడిపిలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ఇటీవలవ వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన వెంకట్రామయ్య వర్గానికి.. ఎళ్లుగా పార్టీలో ఉన్న మరో వర్గానికి మధ్య చోటుచేసుకున్న గొడవల కారణంగానే వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను స్కార్పియోతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.