జమ్ముకశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హతమార్చిన రోజుల వ్యవధి లోనే ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఆపరేషన్‌కు శివశక్తి అని కోడ్ పేరు పెట్టారు. ఎదురు కాల్పుల్లో మృతి చెందినవారిని లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. డేగ్వార్ సెక్టార్‌లో మల్దీవాలన్ ఏరియాలో మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తుల కదలికలను గుర్తించినట్టు భద్రతా బలగాలు పేర్కొన్నాయి.
బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగానే ప్రతిఘటనగా తాము కాల్పులు చేపట్టామని భద్రతా దళాలు పేర్కొన్నాయి. బుధవారం ఆ ప్రాంతం గాలించగా ఉగ్రవాదుల మృతదేహాలు బయటపడ్డాయని చెప్పారు. మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని , ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది ” అని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్ ఎక్స్‌లో వెల్లడించింది. భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు జమ్ముకశ్మీర్ డీజీపీ నలీన్ ప్రభాత్ ధ్రువీకరించారు.