Saturday, September 13, 2025

కస్టడీలో చిత్రవధ అనుభవించా..రూ.9 కోట్లు ఇప్పించండి

- Advertisement -
- Advertisement -

ముంబై : 2006 ముంబై పేలుళ్ల కేసులో అబ్దుల్ వహీద్ షేక్ దశాబ్దం క్రితమే నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. అప్పట్లో ట్రయల్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే తనపై తప్పుడు కేసు పెట్టినందుకు గాను రూ.9 కోట్లు చెల్లించాలని అబ్దుల్ తాజాగా డిమాండ్ చేస్తున్నారు. చేయని నేరానికి కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. ఈ ఏడాది జులైలో ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అబ్దుల్ తనకు పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని జాతీయ మానవహక్కుల కమిషన్, మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తనకు పునరావాసం కూడా కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇలా అన్యాయంగా శిక్షపడిన కారణంగా పరిహారం పొందిన కేసులను కూడా అతడు ఉదహరించాడు. ముంబై పేలుళ్ల కేసులో అబ్దుల్‌ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్కాడ్ అరెస్టు చేసింది. 2015లో ప్రత్యేక కోర్టు ఆయనపై నమోదైన అన్ని అభియోగాలను కొట్టి వేసింది. “జైలు శిక్ష అనుభవించిన కారణంగా కెరియర్‌లో కోలుకోలేని నష్టం జరిగింది.న విద్య, వృత్తి జీవితం నాశనమైంది. క్రూరమైన కస్టడీ హింస కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయి ”అని అబ్దుల్ అందులో పేర్కొన్నారు.

ఉగ్రవాది అనే కళంకం తనకు ఉపాధి లేకుండా చేసిందని వాపోయారు. ఆ కారణంగా ఎవరూ ఉద్యోగం ఇవ్వడం లేదని ఆరోపించారు. అరెస్టు నాటికి తాను పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని వివరించారు. జైలుకు వెళ్లడంతో తనపై ఆధారపడిన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని చెప్పారు. వైద్య , జీవన అవసరాల నిమిత్తం రూ. 30 లక్షల అప్పు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాను నిర్దోషిగా విడుదలైన సమయంలో ఓ సహ నిందితుడు జైలులో ఉన్నాడని,ఆ నైతిక కారణంతో ఇన్ని రోజులూ పరిహారం కోరలేదని అబ్దుల్ తెలిపారు. అతడు నిర్దోషి అమాయకుడని ఈ ప్రపంచానికి తెలిసేవరకు వేచి చూశానని పేర్కొన్నారు. 2006 జులై 11న వెస్ట్రన్ రైల్వే సబర్బన్‌నెట్‌వర్క్ పరిధి లోని ముంబైలో ఏడు రైళ్లలో పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో 180 మందికి పైగా చనిపోయారు.

ఈ కేసులో అరెస్టైన అబ్దుల్‌కు 2015 లో ట్రయల్ కోర్టులో ఊరట లభించింది. మిగిలిన మంది నిందితుల్లో న్యాయస్థానం ఐదుగురికి మరణశిక్ష , ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. వీరిలో మరణశిక్ష పడిన ఓ ఖైదీ 2021లో చనిపోయాడు. ఇదిలా ఉండగా 2025 జులైలో హైకోర్టు 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది.

Also Read: మణిపుర్ పేరులోనే మణి ఉంది.. నేను మీతో ఉన్నా: మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News