ఉజ్జయిని మహంకాళీ బోనాలకు హైదరాబాద్ పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు 2,500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటి పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వు, జిల్లాల నుంచి రప్పించిన పోలీసులను బోనాల విధులకు కేటాయించారు. బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ఇప్పటికే ఆంక్షలపై ప్రకటన విడుదల చేశారు. బోనాల సందర్భంగా 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులను విధులు నిర్వర్తించేలా ఇప్పటికే డ్యూటీలు వేశారు, వాహనాలను ఆగకుండా ఆలయానికి వచ్చే భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. విఐపిలు మహంకాళీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని దీని ద్వారానే ఆలయం లోపలికి పంపించాలని పోలీసు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
బందోబస్తులో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. బోనాల విధుల్లో ఉండే వారికి ఇప్పటికే పాస్‌లు జారీ చేసిన అధికారులు, విఐపిలు వచ్చే దారిలో ఎవరినీ అనుమతించవద్దని ఆదేశించారు. సామన్య భక్తులు కూడా క్యూ లైన్‌లో వచ్చేలా చూడాలని, అడ్డదారిలో ఆలయంలోకి వచ్చే వారిపై నిఘా పెట్టాలని, నిరంతరం సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించాలని ఆదేశించారు. అమ్మవారి దర్శనం సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని క్యూ లైన్లలో తొక్కిల లాట జరగకుండా చూడాలని కోరారు. క్యూలైన్ల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇప్పటికే సికింద్రాబాద్‌లోని మహంకాళీ ఆలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. టాస్క్‌ఫోర్స్, షీటీమ్స్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు, జిల్లాల నుంచి వచ్చిన పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.