గత రెండు రోజుల్లో 27 మంది పాక్ సైనికులను మట్టుపెట్టినట్టు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ( బిఎల్‌ఏ )వెల్లడించింది.బీఎల్‌ఏకు చెందిన ఫతే స్కాడ్ కలాత్ లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్షంగా చేసుకొని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు కరాచీ నుంచి క్వెట్టాకు దళాలను తరలిస్తుండగా ఈ దాడి చోటు చేసుకుంది. మరో ఘటనలో క్వెట్టా లోని హజార్‌గంజ్ లో ఐఈడీ పేల్చి మరో ఇద్దరు సైనికులను హతమార్చినట్టు బీఎల్‌ఏ వెల్లడించింది.
మంగళవారం కలాత్ లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి నలుగురు సైనికులను, బుధవారం గుజ్రోకొర్ ఏరియాలో దాడి చేసి మరో ఐదుగురు సైనికులను హత్య చేసినట్టు బీఎల్‌ఏ ప్రకటించింది. వీరిలో మేజర్ సయిద్ రబ్ నవాజ్ తరీక్ కూడా ఉన్నట్టు చెప్పింది. సమీపం లోని సైనిక కాన్వాయ్‌ను స్నైపర్లు లక్షంగా చేసుకోవడంతో ఆ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ముగ్గురు బీఎల్‌ఏ దళ సభ్యులు చనిపోయినట్టు వచ్చిన వార్తలను ఖండించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ బలోచ్ రెబల్స్ మొత్తం 286 దాడులు చేశారు. మొత్తం 700 మందికి పైగా చనిపోయారు.