ఖాళీగా మిలిలిన సీట్లు 7,974
ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 178 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 91,495 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా రెండు విడతల్లో కలిపి 83,521 సీట్లు(91.2 శాతం) కేటాయించారు. రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత 7,974 సీట్లు ఖాళీ ఉన్నట్లు ప్రవేశాల కన్వీనర్ వెల్లడించారు. ఈ విడతలో కొత్తగా 23,509 సీట్లు కేటాయించగా, స్లైలింగ్ కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న 21,402 మంది విద్యార్థులు సీట్లు పొందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 యూనివర్సిటీ కళాశాలల్లో 6,198 సీట్లు అందుబాటులో ఉండగా, 4,942 సీట్లు (79.7 శాతం) కేటాయించారు. 1256 సీట్లు ఖాళీగా మిగిలాయి. రెండు ప్రైవేట్ యూనివర్సిటీలలో 1,386 సీట్లు అందుబాటులో ఉండగా, 1,380 సీట్లు(99.5 శాతం) కేటాయించగా, 6 సీట్లు ఖాళీగా మిగిలాయి. 155 ప్రైవేట్ కళాశాలల్లో 83,713 సీట్లు అందుబాటులో ఉండగా, రెండు విడతల్లో 77,158 సీట్లు(92.1 శాతం)కేటాయించారు. ప్రైవేట్ కాలేజీల్లో 6,555 సీట్లు ఖాళీగా మిగిలాయి.
రెండో విడత కౌన్సెలింగ్‌లో 6,377 మంది విద్యార్థులు పరిమితంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడం వల్ల వారికి ఏ కాలేజీలోనూ సీట్లు లభించలేదు. రెండో విడతలో ఇడబ్లూఎస్ కోటా కింద 6,445 సీట్లు కేటాయించారు. ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సమయానికి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో మొత్తం 83,054 సీట్లు అందుబాటులో ఉండగా, 77,561 సీట్లు కేటాయించారు. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సీట్లతో కలిపి రెండో విడత కౌన్సెలింగ్‌లో 30,941 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో సీట్లు పొందిన వారు సైతం రెండో విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. మరోవైపు తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారిలో 21,402 మంది స్లైడింగ్ ఆప్షన్‌ను వినియోగించుకున్నట్టు కన్వీనర్ పేర్కొన్నారు.
77 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ
ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపులో ఐదు యూనివర్సిటీలు, 72 ప్రైవేట్ కాలేజీలు మొత్తం 77 ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో 100 శాతం సీట్లు కేటాయించారు.
ఆగస్టు 1 వరకు రిపోర్టింగ్‌కు అవకాశం
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతోపాటు కాలేజీల్లోనూ రిపోర్టింగ్ చేయాలి.అదే సమయంలో విద్యార్థుల సర్టిఫికెట్లు జిరాక్స్ సెట్‌తో పాటు ఒరిజినల్ టిసిని కాలేజీలో అందజేయాలి.