Thursday, September 11, 2025

నేపాల్ జైలులో 8 మంది ఖైదీల మృతి..15 వేల మంది పరారీ

- Advertisement -
- Advertisement -

ఖాట్మండూ: నేపాల్‌లో జెన్‌జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరా చేసుకొని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మాదేష్ ప్రావిన్స్‌లో రమేచాప్ జిల్లా జైలు గోడలను గ్యాస్ సిలిండర్‌తో పేల్చి పరారవ్వడానికి ప్రయత్నించిన ఖైదీలను నివారించడానికి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఖైదీల మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని రమేచాప్ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. గురువారం జైలు గేటు తాళాలను విరగ్గొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసఱ్ శ్యామ్ కృష్ణ థామా పేర్కొన్నారు. వారిని అడ్డగించడానికి ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయన్నారు. యువ నిరసనకారులు అనేక జైళ్ల సౌకర్యాలపై దాడి చేసినప్పుడు జైళ్లు గోడలు పగుల గొట్టడం ప్రారంభమైంది.

ఈ హింసాకాండ మంగళవారం ప్రారంభమైన తరువాత దాదాపు 24 జైళ్ల నుంచి 15,000 మంది ఖైదీలు పరారయ్యారని తెలుస్తోంది. కేవలం స్వల్ప సంఖ్యలోనే ఖైదీలు తిరిగి రావడం లేదా అరెస్టు కావడం జరిగింది. గండకి ప్రావిన్స్‌లో కస్కి జిల్లా జైలు నుంచి 773 మంది ఖైదీలు పరారయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు కాగా, నలుగురు విదేశీయులని జైలర్ రాజేంద్రశర్మ వెల్లడించారు. అన్ని ప్రావిన్సుల జైళ్ల నుంచి ఎంతమంది పారిపోయారో ఇంకా డిపార్టుమెంట్ ఆఫ్ ప్రిజన్ మేనేజ్‌మెంట్ వివరాలు సేకరిస్తోంది. నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీస్ దళం, నేపాల్ పోలీస్ దేశం అంతా ఖైదీల కోసం గాలిస్తున్నారు. వీలైనంతవరకు వేగంగా వారిని తిరిగి అరెస్టు చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామని డైరెక్టర్ జనరల్ లీలా ప్రసాద్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నౌబస్తా రీజినల్ జైలు లోని నౌబస్తా సంస్కరణ గృహం వద్ద బాలనేరస్థులకు, భద్రతా బలగాలకు జరిగిన ఘర్షణలో ఐదుగురు బాలనేరస్తులు చనిపోయారు. ఈ సంఘటనలో మరో నలుగురు తీవ్రంగాగాయపడ్డారు.

బాలనేరస్తులు భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను కాజేయడానికి ప్రయత్నించగా పోలీస్ కాల్పులు జరిపారని నౌబస్తా బాలనేరస్తుల సంస్కరణ గృహం అధికారి చెప్పారు. ముఖ్యమై జైళ్ల నుంచి పరారైన ఖైదీల వివరాలకు సంబంధించి బాంకే జువెనైల్ రిఫార్మ్ సెంటర్ నుంచి 122 మంది, బాంకే జిల్లా జైలు నుంచి 436,సుంధర లోని ఖాట్మండూ వాలీ సెంట్రల్ జైలు నుంచి 3300 మంది, లలిత్‌పూర్ లోని నక్కు జైలు నుంచి 1400 మంది, డిల్లీ బజార్ జైలు నుంచి 1100 మంది ఖైదీలు పరారయ్యారని తేలింది.ఇవి కాక మహోత్తరి లోని జలేశ్వర్ జైలు నుంచి 575 మంది, సున్సారీ లోని ఝుంకా జైలు నుంచి 1575, చిట్వాన్ నుంచి 700 మంది, కపిలవాస్తు జిల్లా జైలు నుంచి 459 మంది,కైలాలి జైలు నుంచి 612 మంది, కాంచన్‌పూర్ జైలు నుంచి 478 మంది, సింధూళి జైలు నుంచి 500 మంది, ఖైదీలు పరారయ్యారని వార్తా పత్రిక కథనం వెలువడింది.

సహస్త్రసీమబల్ అదుపులో 60 మంది అరెస్టు
భారత్ నేపాల్ సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న భారత పారామిలిటరీ దళం సహస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బి) అంతర్జాతీయ సరిహద్దుతోపాటు వివిధ ప్రాంతాల్లో దాదాపు 60 మందిని పట్టుకుంది. వీరిలో చాలామంది నేపాలీయులే. వీరు నేపాల్ జైళ్ల నుంచి పారిపోయి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల వద్ద వీరిని పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. వీరిని సంబంధిత రాష్ట్రాల పోలీసులకు అప్పగించి విచారించనున్నట్టు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిలో ఇద్దరు తాము భారతీయులమే అని చెప్పారు. అయితే ఇది ఎంతవరకు నిజమో పరిశీలించవలసి ఉంది.

ఇదిలా ఉండగా నేపాల్‌భారత్ సరిహద్దులోని రౌతాహత్ జిల్లా గౌర్ జైలును పగుల గొట్టి సరిహద్దును దాటుతున్న 13 మంది ఖైదీలను భారత్ నేపాల్ సరిహద్దుకు కాపలాగా ఉన్న భారత పారామిలిటరీ దళం సహస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బి ) గురువారం పట్టుకుంది. బైర్‌గణీయ చెక్‌పోస్టు వద్ద వీరిని అదుపు లోకి తీసుకుంది. వారిని నేపాల్ పోలీసులకు అప్పగిస్తారు. హోమ్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అజమాయిషీలో సహస్త్రసీమబల్ పనిచేస్తుంది. భారత్ నేపాల్ సరిహద్దు లోని ఎలాంటి కంచె లేని 1751 కిమీ పొడవునా గస్తీ కాస్తుంది. 50 బెటాలియన్లు అంటే 60,000 మంది భద్రతా సిబ్బంది ఇందులో నియమాకమయ్యారు. నేపాల్ సరిహద్దుతో బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, సరిహద్దులను పంచుకున్నాయి. నేపాలీ భద్రతా దళాలు ఎపిఎఫ్‌తో ఎస్‌ఎస్‌బి ఎప్పటికప్పుడు చేరువగా ఉంటుందని, ఈ రెండూ సంయుక్తంగా గస్తీ కాస్తుంటాయని సీనియర్ అధికారి చెప్పారు.

291 మంది నేపాల్ ఖైదీల్లో 260 మంది శిక్షితులే
మొత్తం 291 మంది ఖైదీల్లో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 260 మంది జెన్ జెడ్ ఆందోళనలను ఆసరా చేసుకుని జైలు నుంచి పరారయ్యారు. వారిలో 31 మందినే పోలీసులు తిరిగి వెనక్కు తీసుకు రాగలిగారు. మరో 13 మందిని భారత భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఇంకా మిగిలిన 216 మంది పరారీలో ఉన్నారు.

Also Read: కాల్పుల్లో ట్రంప్ మిత్రుడు జార్లి కిర్క్ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News