దేశంలోని కొన్ని రాష్ట్రాలలో నక్సల్స్ ఆటకట్టు చర్యలను మరింతగా వేగిరపర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని అత్యంత మారుమూల అటవీ దుర్భేధ్య ప్రాంతాలలో భద్రతా బలగాలు 30 కి పైగా కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ పదాతిదళ స్థావరాలతో పాటు సిఆర్‌పిఎఫ్ , కోబ్రా దళాలకు చెందిన ప్రత్యేక విభాగాలను కూడా ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారని అధికార వర్గాలు శనివారం తెలిపాయి.దేశవ్యాప్తంగా 2026 మార్చి నాటికి నక్సలిజం ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్షం నెరవేర్చుకునేందుకు అనువైన సాధనాసంపత్తిని, స్థావరాల సంఖ్య పెంపుపై దృష్టి సారిస్తారు. ప్రత్యేకించి చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అగ్రనేతల ఉనికిని పసికట్టేందుకు , వారి ఆటకట్టించేందుకు వ్యూహరచన చేశారు. శుక్రవారం రాయ్‌పూర్‌లో ఈ మేరకు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్ తపన్ దేకా, సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ , చత్తీస్‌గఢ్ డిజిపి అరుణ్ దేవ్ గౌతమ్ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో క్షేత్రస్థాయిలో తలెత్తే పలు సవాళ్లను సమీక్షించారు. వినూత్నంగా సంతరించుకునే బలంతో మారుమూల ప్రాంతాలకు చొచ్చుకువెళ్లేందుకు అవసరం అయిన ఏర్పాట్లు చేసుకుంటారని వెల్లడించారు. కొత్త యూనిట్లకు అవసరం అయిన జవాన్లను, ఏర్పాట్లను భేటీలో సమీక్షించారు. ఇప్పటి వర్షాకాలం పూర్తికాగానే బస్తర్ ప్రాంతంలో నవంబర్ నెలలో కొత్తగా ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్‌లు ’(ఫాబ్) లు ఏర్పాటు చేసుకుంటారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతమే ఇప్పుడు ఎక్కువగా నక్సల్స్ చర్య కేంద్రంగా ఉంది. ఇక్కడ తమకు ఉన్న పట్టుతోనే నక్సలైట్ల బృందాలు ఎప్పటికప్పుడు తమ దాడులకు పదును పెట్టుకుంటున్నాయి.
నక్సల్స్ అగ్రనేతల ఉనికిని గుర్తించి వారి నుంచి ఎటువంటి కార్యాచరణ లేకుండా చేసేందుకు , అవసరం అయితే వారిని మట్టుపెట్టేందుకు తగు వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సంకల్పించారు. ఈ ప్రాంతంలోపలికి వెళ్లి తమ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు భద్రతా బలగాలకు అనువైన మరింత శిక్షణతో పాటు వారి మానస్థిక స్థయిర్యం పెంచేందుకు , చర్చల్లో వారి ప్రమేయం మరింతగా ఇనుమడింపచేసేందుకు అవసరం అయిన పద్ధతులు , పాటించాల్సిన మార్గాల గురించి కూడా ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. త్వరలోనే కార్యాచరణకు దిగుతారు.