పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ల్లోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు రోజుల్లోనే 321 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఖైబర్పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోనే 307 మంది చనిపోయినట్టు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. ఖైబర్ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని లోయర్ దిర్, బజౌర్, లబోటాబాద్,జబ్రారీతో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడటంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. వరదల కారణంగా పదుల సంఖ్యలో భవనాలు,
పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. అనేక రహదారులు జలదిగ్బంధమయ్యాయి. వరదల్లో అనేక మంది గల్లంతు కాగా, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు దాదాపు 2 వేల మందితో ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు పాక్ లోని మరిన్ని ప్రాంతాలకు భారీ వర్షముప్పు ఉన్నట్టు స్థానిక వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.