నల్లగొండ జిల్లా, దేవరకొండ మండలం, ముదిగొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..బాలికల ఆశ్రమ పాఠశాలలో 310 మంది విద్యార్థినిలకు ఆదివారం రాత్రి అల్పాహారంగా పెసర గుగ్గిళ్లను పెట్టారు. కొద్దిసేపటి తర్వాత బగారా అన్నం, చికెన్‌తో భోజనం పెట్టారు. రాత్రి భోజనం తిన్న తర్వాత పాఠశాలలో కొంతమంది బాలికలకు కడుపునొప్పితో బాధపడుతూ విరోచనాలు, వాంతులతో సతమతం అయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారంగా విద్యార్థినిలకు పులిహోర వడ్డించారు. ఇది తిన్న అనంతరం 35 మంది బాలికలకు తీవ్రమైన కడుపునొప్పి, విరోచనాలు కావడంతో ఆందోళన చెందిన టీచర్లు పాఠశాల ఎఎన్‌ఎంతో పాటు ముదిగొండ గ్రామంలోని ఒక ఆర్‌ఎంపి వద్దకు చికిత్స నిమిత్తం పంపించారు.
ఆయన సూచన మేరకు పెద్ద ఆసుపత్రికి విద్యార్థినుల్లో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మంది, తూర్పుపల్లి పిహెచ్‌సిలో 22 మందిని చేర్పించారు. ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ఈ రెండు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్‌డిఒ రమణారెడ్డి హుటాహుటిన ఆయా ఆసుపత్రులకు చేరుకొని బాలికలను పరామర్శించారు. ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఈ సంఘటనకు దారితీసిన వివరాలు తెలుసుకున్నారు. కాగా, గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగినా డిటిడబ్ల్యుఒ ఇంతవరకు రాలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఉదయం సంఘటన జరిగిన మధ్యాహ్న ఒంటిగంట వరకు రాలేదని మండిపడ్డారు.