సెప్టిక్ ట్యాంక్‌లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి అందులోకి వెళ్లి నలుగురు కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన రాజస్థాన్ లోని జైపూర్‌లో ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. జైపూర్ లోని ఒక జ్యువెలరీ షాపు యజమాని వికాస్ మెహతా బంగారం వెండిని తమ సిబ్బంది ప్రాసెసెంగ్ చేస్తున్న సమయంలో అందులో కొంత మొత్తం సెప్టిక్ ట్యాంక్‌లో పేరుకు పోయినట్టు గుర్తించారు. వాటిని బయటకు తీయాలని సోమవారం అతడు ఎనిమిది మంది కూలీలను అడగ్గా మొదట వారు నిరాకరించారు. బంగారు రజను తీసుకువస్తే అదనంగా డబ్బులు ఇస్తామని షాపు యజమాని ఆశ చూపించడంతో చివరికి అంగీకరించారు. సెప్టిక్ ట్యాంక్ లోకి దిగేటప్పుడు వారు ఎటువంటి భద్రతా పరికరాలు తీసుకెళ్లక పోవడంతో గాలింపు సమయంలో ఊపిరాడక ఎనిమిది మంది కార్మికులు స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీయగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్ పాల్, సంజీవ్ పాల్, హిమాంగ్షు సింగ్, అర్పిత్ యాదవ్ అనే నలుగురు కూలీలు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా భూగర్భ సెప్టిక్ ట్యాంక్ లోకి కార్మికులను పంపడంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అందులో నిజంగానే బంగారు రజను ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆభరణాల షాపు యజమాని, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ సెప్టిక్ ట్యాంకుల్లోకి దిగి పారిశుద్ధ కార్మికులు మరణిస్తున్న సంఘటనలు రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. వాటిని శుభ్రపరిచేందుకు యంత్రాలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, చర్యలు మాత్రం తీసుకోవట్లేదని విమర్శించారు. పారిశుద్ధ కార్మికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.