క్రికెట్ చరిత్రలోనే పెను సంచలనం నమోదైంది. అఫ్గానిస్థాన్ మాజీ ఆటగాడు ఉస్మాన్ ఘని ఒకే ఓవర్‌లో 45 పరుగులు సాధించి నయా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ టి10 కౌంటీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉస్మాన్ ఘని తన మకాంను ఇంగ్లండ్‌కు మార్చుకున్నాడు. అతను ఈసిఎస్ ఇంగ్లండ్ టి10 టోర్నీలో లండన్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రేన్స్ పార్క్ స్పోర్ట్ గ్రౌండ్ వేదికగా గిల్‌ఫోర్డ్, లండన్ క్లబ్ జట్లు తలపడ్డాయి. లండన్ క్లబ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఏకంగా 45 పరుగులు లభించాయి. గిల్‌ఫోర్డ్ బౌలర్ విల్ ఎర్నీ వేసిన ఈ ఓవర్‌లో ఉస్మాన్ ఘని తనబ్యాట్‌తో 38 పరుగులు చేయగా, మరో ఏడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో లభించాయి. ఎర్నీ వేసిన తొలి బంతిని ఘని సిక్స్‌గా మలిచాడు. అంపైర్ ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో ఏడు పరుగులు వచ్చాయి. ఎర్నీ వేసిన ఫ్రీహిట్ బంతిని ఘని స్టాండ్స్‌కు తరలించాడు.
ఆ తర్వాత వేసిన బంతి వైడ్‌గా వచ్చింది. వికెట్ కీపర్ బంతిని ఆపక పోవడంతో అది బౌండరీకి వెళ్లింది. దీంతో ఎక్స్‌ట్రాల రూపంలో ఐదు పరుగులు దక్కాయి. తర్వాత ఓవర్ రెండో బంతికి ఘని సిక్సర్ బాదాడు. అప్పటికే 24 పరుగులు లభించాయి. మూడో బంతిని ఎర్నీ మళ్లీ నోబాల్ వేశాడు. ఈ బంతిని ఘని బౌండరీకి తరలించాడు. దీంతో మరో ఫ్రీహిట్ దక్కింది. ఈ బంతికి ఘని మరో సిక్స్ కొట్టాడు. నాలుగో బంతికి పరుగులు లభించలేదు. కానీ ఐదో బంతికి సిక్స్, ఆరో బంతికి ఫోర్ వచ్చాయి. దీంతో ఈ ఓవర్‌లో రికార్డు స్థాయిలో 45 పరుగులు దక్కాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఘని విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. 28 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు. ఓవరాల్ 43 బంతులు ఆడినఘని 355.81 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 153 పరుగులు సాధించాడు. ఇందులో 17 సిక్స్‌లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఘని విధ్వంసక బ్యాటింగ్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ టీమ్ 10 ఓవర్‌లలో వికెట్ కోల్పోకుండా 226 పరుగులు సాధించింది.