సరిగ్గా నిబంధనలు పాటించకుండా దేశవ్యాప్తంగా ఉన్న మరో 476 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం డిలిస్టు వెలువరించారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని గుర్తింపు పొందని 13 రాజకీయ పార్టీలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదు చేసుకుని ఉన్నప్పటికీ, సరైన సమాచారం లేకపోవడం, కార్యాలయాలు ఉండకపోవడం, ఏ ఎన్నికల్లోనూ ఒక్క సీటు అయినా పోటీ చేయకపోవడం వంటి అంశాలను తీసుకుని పార్టీలను డిలిస్టులో చేర్చారు. కేంద్ర ఎన్నికల సంఘం రద్దు జాబితాలోని తెలంగాణ సంబంధిత పార్టీల వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన రెడ్డి తమ ప్రకటనలో వివరించారు. ఈ పార్టీల ఉనికి లేకుండా చూడాల్సిన చర్యలు చేపట్టాలని సంబంధిత జిల్లాల స్థాయి ఎన్నికల అధికారులకు సూచించారు.
ఇప్పుడు రద్దు జాబితాలో ఉన్న ఈ టి పార్టీలు ఇవే ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ రంగారెడ్డి, బహుజన సమాజ్ పార్టీ ( అంబేద్కర్ పూలే) , ఇండియన్ మైనార్టీస్ పొలిటికల్ పార్టీ , జాగోపార్టీ, జాతీయ మహిళా పార్టీ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ , తెలంగాణ లోక్‌సత్తా పార్టీ , తెలంగాణ మైనార్టీస్ ఒబిసి రాజ్యం పార్టీ, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ , యువ పార్టీ, యువ తెలంగాణ పార్టీ పేర్లు ఈ డిలిస్టు జాబితాలో ఉన్నాయి. ఇందులో చాలా వరకూ పార్టీల పేర్లు ప్రజలలో ఎక్కువ మందికి తెలియనవి. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇటువంటి 17 పార్టీలను కూడా ఇసి తమ జాబితాలో నుంచి తీసివేసింది. దేశ ఎన్నికల వ్యవస్థను సరైన విధంగా క్రమబద్థీకరించే పలు చర్యలలో భాగంగానే ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ తీసివేతల ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. పార్టీల పేరుతో ప్రజలను మభ్యపెట్టే కొందరు నేతలకు చురక పెట్టేందుకు తగు విధంగా ఈ డిలిస్టు రూపొందించారు