Tuesday, July 15, 2025

ఐదుగురు సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుల లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై శాంతి బాట పడుతున్నారని జిల్లా ఎస్‌పి డాక్టర్ శబరీష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఆయన సమక్షంలో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మావోల లొంగుబాటు వివరాలు వెల్లడించారు. పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సంయుక్తంగా చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ కల్పిస్తున్న పునరావాస సదుపాయాలు తెలుసుకుని నక్సలిజాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ హోదాలలో పనిచేస్తున్న ఐదుగురు దళ సభ్యులు లొంగిపోయినట్లు తెలిపారు. జనవరి 2025 నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 73 మంది మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ హోదాల్లో పనిచేసిన సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారని అన్నారు.

పునరావాస పథకానికి అనుగుణంగా తగిన సదుపాయాలు ప్రభుత్వం ద్వారా లొంగిపోయిన వారికి అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు వారి ఆరోగ్యపరిస్థితుల దృష్టా పోలీసుల ఎదుట లొంగిపోవాలని, వారికి ప్రభుత్వం అందించే పునరావాసం తక్షణ సాయం రూ.25 వేలు అందించడంతో పాటు, వారి హోదాలను దళ సభ్యులకు లక్ష రూపాయలు, హోదా ఉన్నవారి పై రివార్డును అందజేస్తామని అన్నారు. మావోయిస్టులలో 90 శాతం పైగా క్యాడర్లు నిరుపేద ఆదివాసీలు, వారి కుటుంబాల అభివృద్ధి కోసం పార్టీని వీడి ప్రజాస్వామ్య ప్రభుత్వాల మార్గంలో అభివృద్ధికి భాగస్వాములు అవుతున్నారని అన్నారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు తక్షణ సాయం ద్వారా ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున లక్షా 25 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఎఎస్‌పి శివం ఉపాధ్యాయ, ఒఎస్‌డి, ఇన్‌ఛార్జి ములుగు డిఎస్‌పి నలువాల రవిందర్, సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రశాంత్ బివి, ఎస్‌బి సిఐ వి శంకర్, ఆర్‌ఐ తిరుపతి, వెంకటాపురం ఎస్‌ఐ తిరుపతి రావు, మంగపేట రెండవ ఎస్‌ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News