తమ ముగ్గురు పిల్లలతో పాటు భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని బావ్లా తాలూకాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను విపుల్ కాంజి వాఘేలా(34), అతని భార్య సోనాల్(26).. 11, 5ఏళ్ల ఇద్దరు కూతుర్లు, 8ఏళ్ల కుమారుడిగా పోలీసులు గుర్తించారు. గుజరాత్‌లోని సమీప పట్టణమైన ధోల్కాకు చెందిన విపుల్ కాంజి తన కుటుంబం బాగోద్ర గ్రామంలో బస్ స్టేషన్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది.
అయితే, విపుల్ కుటుంబం శనివారం (జూలై 19) రాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తలు తమ ముగ్గురి పిల్లలకు విషం ఇచ్చి.. తర్వాత వారు కూడా తీసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.