Friday, August 22, 2025

కాంగ్రెస్ క్రెడిట్ కాదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణకు యూరి యా కేటాయించిందని, అయితే అది కాంగ్రెస్ పా ర్టీ క్రెడిట్ కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఒత్తిడి చేయ డం వల్లే కేంద్రం దిగి వచ్చిందంటూ కాంగ్రెస్ పా ర్టీ ప్రచారం చేసుకోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణకు 20 లక్షల మెట్రిక్ టన్నుల అ వసరం ఉందని, అయితే ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా జరిగిందని తెలిపారు. మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అం దుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. ఆయ న గురువారం ఢిల్లీలో  మీడియాతో మాట్లాడుతూ దాదాపు 50వేల మెట్రిక్ టన్నులు యూరియా ట్రాన్సిట్‌లో కరైకల్ పోర్టులో యూరియా ఉందని దీనిలో ఇఫ్కో నుంచి 15 వేల మెట్రిక్ టన్నులు, క్రిభ్ కో నుంచి 17,500 మెట్రిక్ టన్నులు, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ నుంచి 7,500 మెట్రిక్ టన్నులు తెలంగాణకు వస్తోందని తెలిపారు. కేంద్రం అంకితభావంతో ఉంది కాబట్టే అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నా రైతులకు మేలు చేస్తున్నామని వివరించారు.

తెలంగాణ మంత్రులు రోజూ యూరియా లేదని మాట్లాడుతున్న కారణంగా దొరికిన చోట కొందరు దీన్ని ఎక్కువ నిల్వ చేసుకోవడం వల్లే సమస్య ఉత్పన్నమైందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 11 ఏళ్లలో ఏనాడూ యూరియా కొరత ఏర్పడలేదని, తెలంగాణ రైతుల్లో ఆందోళన రెకెత్తించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎక్కువ యూరియా నిల్వలు ఉంచామని, అదేమైందో తెలియదని చెప్పారు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవడం, దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని హితవు పలికారు. యూరియాకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు ఇవ్వడం తాము బాధ్యతగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో ఉన్న యూరియా కంపెనీలను మూసేశారని, తాము వాటిని తెరిపించి యూరియా ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించామని చెప్పారు. అన్ని దేశాల్లో యూరియా ధరలు పెరిగాయని, కానీ భారతదేశంలో మాత్రం ఒక్క రూపాయి ధర కూడా పెంచలేదని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రతిసారి మంత్రివర్గ సమావేశంలో సబ్సిడీని పెంచుతూ రైతులపై భారం పడకుండా చూస్తున్నామన్న ఆయన అది రైతుల పట్ల తమకు ఉన్న అంకితభావమని వెల్లడించారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికకు బిఆర్‌ఎస్ మద్దతు అవరం లేదు
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ మద్దతు బీజేపీకి ఇవ్వాలని తాము అడగలేదని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గతంలో తెలుగు గౌరవం గుర్తుకు రాలేదా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. నాడు వెంకయ్యనాయుడు పోటీచేస్తే తెలుగు గౌరవం, జీఎంసీ బాలయోగికి వ్యతిరేకంగా పోటీలో అభ్యర్థిని నిలిపినపుడు తెలుగు గౌరవం గుర్తురాలేదా? అని నిలదీశారు.

130వ రాజ్యాంగ సవరణ ప్రతిష్టాత్మకం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 130వ రాజ్యాంగ సవరణను లోక్ సభలో ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సవరణ ప్రతిపాదన ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి మరింత గౌరవాన్ని కల్పించిందని, కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సంస్కరణ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొని అరెస్టు అయి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే పదవినుంచి తొలగిపోవాలనే ఆలోచనతో కేంద్రం ఈ సంస్కరణను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రాజ్యసభలో, తర్వాత జెపిసిలో చర్చించనున్నారని తెలిపారు. దేశమంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోందని తెలిపారు. మేధావులు, మీడియా, ప్రజలు ఈ సంస్కరణ పట్ల సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయి 48 గంటల పాటు జైల్లో ఉంటే ప్రభుత్వం ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు అరెస్టయితే, తీవ్రమైన నేరారోపణలో జైలుకెళితే, వారిపై కనీస చర్యలుండవా? అని ప్రశ్నించారు. దీనిపై లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, వారి అభిప్రాయాలు దురదృష్టకరమని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం తీసుకొచ్చిన చట్టం కాదని, అన్ని పార్టీలకు ఇది అమలువతుందనే విషయం వారికి అర్థం కావడం లేదా? అని నిలదీశారు.

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని అన్నారు. తమపై ఆరోపణలు వచ్చినపుడు రాజీనామా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. 1995లో హవాలా కేసులో సీబీఐ పలువురు నేతలతో పాటు ఎల్‌కె అడ్వాణీ పేరు చేర్చినపుడు కేసునుంచి బయటపడేంతవరకు ఎన్నికల్లో పోటీ చేయనని వారు చెప్పారని కిషన్‌రెడ్డి తెలిపారు. 1997లో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత1998లో పోటీ చేశారని, ఇది నైతిక రాజకీయాలకు పెద్దపీట వేసిన సందర్భమని గుర్తు చేశారు. 2005లో సోరాబుద్ధీన్ ఎన్ కౌంటర్ కేసులో నాటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా పేరు సీబీఐ చార్జిషీటులో ఉంటే వారు మంత్రిగా రాజీనామా చేసి 2014లో వారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతే పార్టీ బాధ్యతలు చేపట్టారని, ఆ తర్వాతే లోక్ సభకు పోటీ చేశారని అన్నారు. జార్ఖండ్ సీఎం కూడా ఆరోపణలు వచ్చినపుడు రాజీనామా చేసి జైలుకెళ్లారని అన్నారు. దేశం కోసం, దేశ హితం కోసం సంస్కరణలు తీసుకొస్తామని వివరించారు. పార్లమెంట్‌లో కేంద్రం తెచ్చిన మూడు బిల్లుల విషయంలో ఇండియా కూటమి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లులకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News