రాత్రికి రాత్రే భారీగా కురిసిన వానలతో హర్యానాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. యమునానగర్ లోని సరస్వతి సుగర్ మిల్ ప్రాంగణం లోకి నీరు చేరింది. దాంతో ఆసియాలో అతిపెద్ద షుగర్ మిల్‌గా పేరు గాంచిన దానిలో కోట్ల రూపాయల విలువ చేసే పంచదార కరిగిపోయింది. యమునానగర్ ప్రాంతం లోని గిడ్డంగిలో 2.20 లక్షల క్వింటాళ్ల పంచదారను నిల్వ చేశారు. దాని మొత్తం విలువ రూ.97 కోట్లు. అయితే వర్షాల కారణంగా పక్కనున్న కాలువ పొంగి నీరు మిల్లులోకి చేరిందని సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా వెల్లడించారు. రాత్రి భారీ వర్షంతో మిల్లు ప్రాంగణం లోకి నీరు వస్తోందని అర్ధరాత్రి సమయంలో
తమ సిబ్బంది అప్రమత్తం చేశారని, మిల్లు పక్కనున్న కాలువ ఆక్రమణకు గురికావడంతో దానిలో నీరు ఒక్కసారిగా పొంగిందని చెప్పారు. ఆ నీరు మిల్లు లోకి చేరడంతో క్వింటాళ్ల కొద్దీ పంచదార తడిసిపోయిందన్నారు. దాని విలువ రూ50 నుంచి 60 కోట్ల వరకు ఉంటుందని , ఒకసారి గిడ్డంగి మొత్తాన్ని పరిశీలించి పూర్తి నష్టాన్ని వెల్లడిస్తామని తెలిపారు. మిల్లులోకి ఇలా వరద నీరు రావడం ఇదే తొలిసారని, రూ. కోట్లలో నష్టం వచ్చినా, స్థానిక మార్కెట్లలో పంచదార లభ్యతపై ప్రభావం ఉండదని మిశ్రా వెల్లడించారు. మిల్లు లోని నీటిని తొలగించడానికి అధికారులు క్రేన్‌ను వినియోగిస్తున్నారు.