రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లాలో గిరిజన ప్రాబల్యం గల ఝూడోల్ బ్లాక్‌లో 55 ఏళ్ల రేఖా కల్‌బెలియా 17 వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బ్లాక్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఈ ప్రసవం జరిగింది. స్థానిక ఆరోగ్య కేంద్రానికి చెందిన గైనకాలజిస్టు డాక్టర్ రోషన్ దారంగి మాట్లాడుతూ రేఖను ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెకు ఇది నాలుగో కాన్పు అని ఆమె కుటుంబ సభ్యులు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. రేఖ భర్త కవర కల్‌బెలియా చెత్త ఏరుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఈ దంపతుల సంతానంలో 12 మంది జీవించి ఉన్నారు.
వారిలో ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు. వీరెవరూ పాఠశాల ముఖం చూడలేదు. వీరిలో 11 మందికి పెళ్లిళ్లు కావడంతోపాటు ఒక్కొక్కరికీ ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీంతో 17 వ బిడ్డకు రేఖ జన్మనివ్వకముందే ఆమెకు మనవళ్లు, మనవరాళ్లు ఉండటం విశేషం. లీలావాస్ గ్రామానికి చెందిన కవర రామ్ భార్య అయిన 55 ఏళ్ల రేఖ బుధవారం 17 వ కాన్పు కనగానే ఆమె కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో తన పిల్లల కోసం వడ్డీకి అప్పు చేసినట్టు కవర చెప్పాడు.