మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే అందిన ఆదేశాల మేరకు పంచాయతీల నుంచి జిల్లా పరిషత్ వరకు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సంబంధిత అధికారులు చేపట్టారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిటిసిలు, జడ్పీటిసిల సంఖ్యను ఖారారు చేయడంతో ఆ లెక్కకు ముగింపు పలికారు. రాష్ట్రంలో 5773 ఎంపిటిసిలు, 566 జడ్పీటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు. దాదాపుగా ఇవే లెక్కల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీల్లో సమీపంలోని పంచాయతీలు, మండలాలు విలీనం కావడంతో సంఖ్య తగ్గింది. ఈ ఎంపీటీసీ, జడ్పీటిసి స్థానాలు తగ్గే తగ్గాయని అధికార వర్గాల సమాచారం.
2019లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుతం వాటి సంఖ్య 12,777కు చేరింది. ఈ లెక్కలు పూర్తయిన తర్వాత చివరిగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు జీహెచ్‌ఎంసీ, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చేర్చి ఉన్న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నగర శివారుల్లో ఉన్న మున్సిపాలిటీల్లో కలిసిపోవడం వల్ల 32 జిల్లా పరిషత్‌లకు గాను ఇప్పుడు 31కి తగ్గాయి. గత 2019 ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరిగితే, ఇప్పుడు 31కి మాత్రమే ఎన్నికలు జరుగుతాయని అధికార వర్గాల సమాచారం. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 33 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 31, సిద్దిపేట జిల్లాలో 26, కామారెడ్డిలో 25 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అతితక్కువగా ములుగు జిల్లాలో 10 జడ్పీటీసీ స్థానాలున్నాయి.